తెలంగాణకు మాయావతి.. ‘భరోసా’ పేరుతో బహిరంగ సభ

బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి వచ్చే నెల 7వ తేదీన రాష్ట్రానికి రానున్నారు.

Update: 2023-04-21 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి వచ్చే నెల 7వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ‘భరోసా’ పేరుతో భారీ బహిరంగా సభ ఏర్పాట్లపై రాష్ట్ర బీఎస్పీ నేతలు దృష్టి సారించారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం కోసం బీఎస్పీ నేతలు కసరత్తు చేస్తున్నారు. త్వరలో మీడియా సమక్షంలో బహిరంగ సభ తేదిని అధికారికంగా వెల్లడించనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాయావతి మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. దీంతో ఆర్ఎస్పీని, మాయావతిని తెలంగాణ సభలో ఒకే వేదికపై చూడబోతున్నందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

పొలిటికల్‌గా కలిసొచ్చే జిల్లాపై ఆర్ఎస్పీ ఫోకస్..

బహుజన రాజ్యాధికార యాత్రతో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరువయ్యారు. కేంద్ర, రాష్ట్ర సమస్యలపై నిత్యం పోరాడుతునే ఉన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కానీ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఆర్ఎస్పీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల్లో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ వారిని కలుస్తూనే ఉంటారు. అఖిలపక్ష నాయకులతో కలిసి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే ఆర్ఎస్పీ పొలిటికల్‌గా కలిసొచ్చే జిల్లాపై ఫోకస్ పెట్టారు. బీఎస్పీకి ఏ ఏ జిల్లాలో ఏఏ నియోజకవర్గాల్లో ఆదరణ ఉందో అన్నదానిపై దృష్టిసారించారు. ముఖ్యంగా మొదటి నుంచి బీఎస్పీకి అనుకూలంగా ఉండే ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై ఆర్ఎస్పీ ఫోకస్ పెట్టారు. మిగిత జిల్లాలో కూడా పార్టీ బలోపేతం కోసం వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం.

సభ గ్రాండ్‌ సక్సెస్ చేసేందుకు వ్యూహం..

తెలంగాణలో బీఎస్పీ పార్టీ క్రేజ్ పెంచడం కోసం, ప్రజల్లోకి మరింత బలంగా పార్టీ చొచ్చుకుపోవడం కోసం మాయావతి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నేతలు వస్తున్నట్లు సమాచారం. ఈ సభకు భారీగా జనసమీకరణ చేయడం కోసం ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలపై ఈ సభ ద్వారా ఆర్ఎస్పీ నిలదీయనున్నారు. ఈ సభలో బీఎస్పీ చీఫ్ మాయావతి చేయబోయే ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై, లిక్కర్ స్కాం వ్యవహారంపై ఏవిధంగా కామెంట్స్ చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News