Maoist Warning: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్ట్ వార్నింగ్ లెటర్.. ఖబడ్దార్ అంటూ..
దళితబంధు పేరుతో అమాయకప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుల్ని తిరిగివ్వకపోతే.. కఠిన శిక్ష ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్.
దిశ, వెబ్ డెస్క్/కాటారం: దళితబంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబడ్దార్ అంటూ.. మావోయిస్టు పార్టీ (Maoist Party) అధికార ప్రతినిధి జగన్ (Jagan) పేరుతో వార్నింగ్ లెటర్ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన రాజకీయ బ్రోకర్లు.. ఆ డబ్బును తిరిగి వారికి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు డబ్బులను తిరిగి ఇవ్వకపోతే కఠిన శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, ఆశలు చూపించి తీసుకున్న లక్షల రూపాయల్ని తిరిగివ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాముత్తారం మాజీ జడ్పీటీసీ మందల రాజిరెడ్డి, మార్కరామ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పక్కల సడవలి, మాజీ జడ్పీటీసీ భర్త లింగమల్ల దుర్గయ్య, మాజీ ఎంపీపీ భర్త రత్నం సడవలి, పీసీసీ మెంబర్ బెల్లంకొండ కిష్టయ్య, కాటారం మాజీ ఎంపీటీసీ తోట జనార్థన్, మాజీ జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి భర్త రాకేష్, భూపెల్లి రాజు, మహాదేవపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, పలిమెల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జవాజి తిరుపతి, మల్హాల్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు, భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్తపల్లి హరిబాబు.. ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగివ్వకపోతే, కఠిన శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. కాగా, ఈ లేఖ నిజమైనదా..? లేక ఎవరైన బాధితులు మావోయిస్టుల పేరుతో పంపించారా అనేది తెలియాల్సి ఉంది.