ప్రొఫెసర్ సాయిబాబాకు అంతిమ నివాళి
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (58) ఆకస్మిక మృతి వార్త విన్న పలువురు ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (58) ఆకస్మిక మృతి వార్త విన్న పలువురు ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల నుంచి ఆయన చివరి చూపు కోసం, నివాళులర్పించడానికి సోమవారం హైదరాబాద్ రానున్నారు. జీర్ణకోశ సంబంధ వ్యాధి సహా పలు అనారోగ్య సమస్యలతో రెండు వారాలుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తీవ్రమైన గుండెపోటుతో శనివారం రాత్రి కన్నుమూసిన ప్రొఫెసర్ సాయిబాబా మృతి పట్ల ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజ్యం చేసిన హత్యగా పలువురు వ్యాఖ్యానించగా, ప్రజా ఉద్యమాలకు, పౌర హక్కుల పరిరక్షణకు ఆయన మృతి తీరని లోటు అని మరికొందరు నివాళులర్పించారు. నిమ్స్ ఆస్పత్రి నుంచి భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు తీసుకుని తొలుత గన్ పార్కు దగ్గరి అమరవీరుల స్థూపం దగ్గరకు తీసుకెళ్తామని, ఆ తర్వాత మౌలాలిలోని ఆయన సోదరుడి నివాసానికి తరలిస్తామని, మధ్యాహ్నం తర్వాత ఆయన చివరి కోరిక మేరకు గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయాన్ని అప్పగిస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీజీ చేశారు. రాంలాల్ కాలేజీలో అధ్యాపకుడిగా ప్రారంభమైన ప్రస్థానం ఢిల్లీ వర్శిటీలో ప్రొఫెసర్ దాకా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజల నుంచి పెద్దగా డిమాండ్ లేని రోజుల్లోనే 1990వ దశకం ప్రారంభంలో ప్రజాస్వామిక తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా (అమలాపురం) అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా సమర్ధించారు. ఢిల్లీ వర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలోనే 2014లో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మూడు సంవత్సరాల పాటు జైలులో గడిపారు. 2017లో గడ్‌చిరోలి ట్రయల్ కోర్టు ఆయనపై ఆరోపణలు రుజువయ్యాయని తీర్పును వెలువరించి జీవిత ఖైదు విధించింది.
అప్పటి నుంచి నాగ్‌పూర్ అండా జైలులో ప్రత్యేక సెల్‌లో ఉన్న ఆయన పలుమార్లు బాంబే హైకోర్టును ఆశ్రయించి వీల్‌చైర్‌కు పరిమితమైన తనకు కనీస సౌకర్యాలను కల్పించాలని, పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నందున వైద్య సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. తల్లి చనిపోయినప్పుడు పెరోల్ మీద విడుదల చేయాలని కోరారు. తొమ్మిదేండ్ల పాటు నాగపూర్ జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. సుప్రీంకోర్టును ఆశ్రయంచడంతో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ వాదించారు. చివరకు ఆయనను సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 7న ఆయన విడుదలైన తర్వాత అనారోగ్య సమస్యలకు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలోనే నిమ్స్ ఆస్పత్రిలో జీర్ణకోశ సంబంధ వ్యాధికి సర్జరీ పూర్తయిన తర్వాత బీపీ కారణంగా తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చి శనివారం రాత్రి 8.45 గంటలకు మృతి చెందినట్లు సాయిబాబా సోదరుడు రాందేవ్ తెలిపారు.
కుటుంబ సభ్యులు పేర్కొన్న వివరాల ప్రకారం...
- ఉదయం 8.00 గంటలకు నిమ్స్ ఆస్పత్రి మార్చురీ నుంచి ప్రొ. సాయిబామా మృతదేహాన్ని తీసుకోనున్న భార్య వసంత, ఆయన సోదరుడు రాందేవ్
- ఉదయం 9.00 గంటలకు : గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం దగ్గరకు
- 10 గంటలకు మౌలాలిలోని సోదరి నివాసానికి భౌతికకాయం. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రొఫెసర్లు, ప్రజాస్వామిక వాదులకు చివరి చూపు కోసం మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడే భౌతికకాయం.
- మధ్యాహ్నం 2.30 గంటలకు సోదరుడు రాందేవ్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం.
- సాయంత్రం 4.00 గంటల సమయానికి గాంధీ మెడికల్ కాలేజీకి ప్రొ. సాయిబాబా భౌతికకాయం అప్పగింత. ఇప్పటికే ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అప్పగించిన కుటుంబ సభ్యులు