అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్‌లు.. సీఎస్ శాంతికుమారి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్' లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.

Update: 2024-06-13 12:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్' లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్'ల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో సీఎస్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్ లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే, 'అన్న' క్యాంటీన్ల పేరుతో కేరళలో, 'దీదీ కా రసోయ్' అనే పేరుతో బెంగాల్‌లో నడుస్తున్న క్యాంటీన్ ల పని తీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

ఈ క్యాంటీన్ ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు. క్యాంటీన్ నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ క్యాంటీన్ ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సిందిగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమిషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News