Collector : నిర్వాసితులకు అండగా ఉంటాం

నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, ముంపు గ్రామాల ప్రజలు ఎవరు అధైర్య పడొద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.

Update: 2024-10-24 12:02 GMT

దిశ, కొల్లాపూర్ : నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, ముంపు గ్రామాల ప్రజలు ఎవరు అధైర్య పడొద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామస్థులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సందర్శించారు. గ్రామస్తులతో కలిసి ముంపు ప్రాంతాలను పర్యటించి సమస్యలను కలెక్టర్ తెలుసుకున్నారు.

ముంపుకు గురవుతున్న ఆయా గ్రామాల ప్రజల అవసరాలు, పునరావాసానికి కావలసిన సదుపాయాలు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పించి మంచి ఆర్ అండ్ ఆర్ కాలనీని నిర్మించి, ఆ కాలనీలో ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆసుపత్రి, విశాలమైన సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలతోపాటు ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అందుకు మంత్రితోపాటు, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో నిర్వాసితులకు అండగా ఉంటామని కలెక్టర్ ఈ సందర్భంగా గ్రామస్తులకు స్పష్టం చేశారు.

గ్రామస్తులు తమకు ఇల్లు కట్టుకునేందుకు నివాసస్థలలకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ముంపులో కోల్పోయిన భూములకు భూములు ఇచ్చే విధంగా చూడాలని రైతులు, గ్రామస్తులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు. 125, 176 సర్వేనెంబర్ రైతులకు తగిన పరిహారం చెల్లించాలని రైతులు కలెక్టర్ ను కోరారు. ఎర్రగట్టుబొల్లారం గ్రామంలో ఫారెస్ట్ అధికారులతో కలిసి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫారెస్ట్ భూమి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో 64 కుటుంబాలు నివసిస్తున్నారని, ఇండ్ల నిర్మాణాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, ఈ సందర్భంగా కలెక్టర్ కు పలువురు గ్రామస్తులు తెలియజేశారు. బోరబండ తండా గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 125,176 భూముల కు సంబంధించిన రైతులకు పరిహారం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి షిఫ్టింగ్ కావాలని గ్రామస్తులకు కలెక్టర్ తెలిపారు. అంత ముందు తమ గ్రామానికి సందర్శించి వచ్చిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ను ఆయా గ్రామాల ప్రజలు పుష్ప గుచ్చం, శాలువాతో సత్కరించారు. కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ విష్ణువర్ధన్ రావు, వివిధ శాఖల అధికారులు కొల్లాపూర్ మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్, ఆయా ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలు తదితరులు ఉన్నారు.


Similar News