ప్రజా ప్రభుత్వం తో విప్లవాత్మక మార్పులు తెచ్చాం : ఎమ్మెల్యే యెన్నం
గత 2023 డిసెంబర్ 7 న అధికారం చేపట్టిన ప్రజా
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: గత 2023 డిసెంబర్ 7 న అధికారం చేపట్టిన ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.కొత్త సంవత్సరంలోకి స్వేచ్ఛగా,సంతోషంగా అడుగుపెట్టబోతున్నామని,ప్రజలకు అవినీతి రహిత ప్రజాపాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని,అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు సైతం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.మాది అధికారుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని,ఇప్పుడిప్పుడే అధికారులకు అర్థం అవుతుందని,మేము పాలకులం కాదు సేవకులం అని ఆయన అన్నారు.
తమ దృష్టికి వచ్చిన చిన్న చిన్న పనులను పెండింగ్ లో పెట్టవద్దని వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు.కొత్త సంవత్సరంలో కొత్త ఆవిష్కరణలకు తెర లేపుదామని అందుకు అధికారులు సహకరించాలని కోరుతూ,అక్కడక్కడా కొందరిలో ఇంకా అలసత్వం ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.ప్రజల కోసం పడుతున్న ఆరాటాన్ని అధికారులు అర్థం చేసుకొని సమన్వయంతో కలిసి పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి,అదనపు కలెక్టర్ మోహన్ రావు,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.