Palamuru : పాలమూరు బాటన అగ్ర నేతలు.. అక్టోబర్ 1న ప్రధాని రాక
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అగ్ర నేతలు పాలమూరు బాట పడుతున్నారు.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్ నగర్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అగ్ర నేతలు పాలమూరు బాట పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ,సామాజిక,ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి అనధికారికంగా శ్రీకారం చుట్టే పనిలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన హర్షవర్ధన్ రెడ్డి ని కూడా తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా 14 స్థానాలు గెలిచి గట్టిపట్టు సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పట్టు సడలకుండా ఉండేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచనలు రూపొందించి అమలు చేస్తుంటే.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో ఉన్న అన్ని నియోజకవర్గాలపై పట్టు సాధించాలన్న కసితో ఉంది.
గత కొన్ని నెలలుగా స్తబ్దంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎవరు ఊహించని విధంగా తమ ఆధిపత్యాన్ని చలాయించుకునేలా జాతీయ స్థాయి నేత ప్రధానమంత్రిని రంగంలోకి దించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పట్టు సాధిస్తే.. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలోనూ సాధించేందుకు అవకాశాలు లభిస్తాయి అన్న నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనను ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్లాపూర్ నియోజకవర్గంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడంతో మిగిలిన పార్టీలు జిల్లా పై పట్టు సాధించేలా భారీ బహిరంగ సభ నిర్వహణకు ముఖ్య నేతల కార్యక్రమాల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు నరేంద్ర మోడీ ఉమ్మడి జిల్లాకు వస్తుండడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
అక్టోబర్ 1న ప్రధాని రాక
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1వ తేదీన పాలమూరు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈ మేరకు భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు చేరువై.. ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా ప్రధాని బహిరంగ సభను వాడుకునేందుకు పార్టీ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఒకరకంగా దేశ ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారానికి పాలమూరు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సెంటిమెంట్ ప్రకారం శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి.
కేటీఆర్, హరీష్ రావు రాక
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల పర్యటనలు కొత్త కాకపోయినప్పటికీ.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వారి పర్యటనలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ నెల 29వ తేదీన మంత్రి కేటీఆర్ వనపర్తి నియోజకవర్గంలో భారీ ఎత్తున చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే అక్టోబర్ 4వ తేదీన మంత్రి హరీష్ రావు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇతర పలు కార్యక్రమాలలోనూ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కొత్తకోటలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సారథ్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ ముఖ్య నేతల పర్యటనలు ఉమ్మడి జిల్లాలో మరిన్ని ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి చేరిక సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో నెల రోజుల క్రితమే భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి. అప్పట్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆ కార్యక్రమం వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో ప్రధాని,మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కార్యక్రమాలు ఖరారు అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సభ ఎక్కడ అనేది తెలియాల్సి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంగా ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతుండడంతో ఎన్నికల రాజకీయ వేడి ప్రారంభం కానుంది.