ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత సాధ్యం.. రాఘవాచారి

ఉద్యమించడం తెలంగాణ పౌరసమాజానికి కొత్త కాదని, ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత సాధ్యమవుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు.

Update: 2025-04-25 12:16 GMT
ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత సాధ్యం.. రాఘవాచారి
  • whatsapp icon

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉద్యమించడం తెలంగాణ పౌరసమాజానికి కొత్త కాదని, ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత సాధ్యమవుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. గతవారం రోజులుగా రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మెలో భాగంగా, పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు కొనసాగిస్తున్న నిరవధిక సమ్మె శిబిరంలో ఆయన శుక్రవారం పాల్గొని సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు.

ప్రభుత్వాలు విద్య పట్ల ప్రదర్శిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమే నేడు కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న నిరవధిక సమ్మె అని ఆయన విమర్శించారు. ఉన్నత విద్యావంతులైన యూనివర్సిటీ అధ్యాపకులు, తమ ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం టెంటు వేసుకొని కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపు అని, స్థానికంగా ఉన్న మేధావుల సేవలను గుర్తించి, వారిని రెగ్యులరైజేషన్ చేయడం ద్వారా సముచిత గౌరవం లభిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు తాము ప్రకటించిన హామీలను అమలుపరచి, వెంటనే కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News