కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప మార్పేమీ లేదు.. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

మార్పు రావాలి, మార్పు కావాలి అంటూ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీవి మాటలే తప్ప మార్పేమీ లేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Update: 2024-07-03 16:37 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మార్పు రావాలి, మార్పు కావాలి అంటూ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీవి మాటలే తప్ప మార్పేమీ లేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జిల్లా కేంద్రం న్యూటవున్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించి ప్రసంగించారు. పంటలు వేసుకుంటున్న రైతులకు కరెంటు లేక, చెరువులు, కుంటలు ఎండిపోయి, సాగునీరు లేక వారి బాధలు వర్ణనాతీతమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆసరా పెన్షన్ 4 వేలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, మహిళలకు నెలనెలా 2500 రూపాయలు, 500 లకే గ్యాస్ సిలిండర్ అని ప్రజలకు అనేక అబద్ధపు హామీలతో మోసం చేశారని, ప్రజలు జరిగిన పొరపాటును గ్రహించి తమ తప్పును తెలుసుకున్నారని ఆయన అన్నారు. పార్టీకి నాయకులు అండగా ఉంటూ, చేసిన పొరపాట్లను సరిచేసుకుని ప్రజలతో మమేకమై ముందుకు వెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు.

పార్టీకి పూర్వ వైభవం తేవాలి...

బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కార్యకర్తలు, స్థానిక సంస్థల నాయకులకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు పట్టణాన్ని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేశాడని, ఆయన మంచి వ్యక్తిత్వం, పట్టుదల గల నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ గౌడ్, కెసీ.నర్సింహులు, కొరమోని వెంకటయ్య, వెంకటేశ్వరమ్మ, సుధాశ్రీ, కౌన్సిలర్లు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News