ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..పోలీసుల అనుమానమే నిజమైంది..!
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30) ఈనెల 8న తన వ్యవసాయ పొలంలో హత్యకు గురయ్యారు.
దిశ ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30) ఈనెల 8న తన వ్యవసాయ పొలంలో హత్యకు గురయ్యారు. ఘటనపై మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ఎంజి కాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు అతని భార్య హిమబిందుకు 9 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూతురు ఉంది. గత సంవత్సర క్రితం మృతుడి భార్య హిమబిందుకు మహేశ్వరం నియోజకవర్గం కళ్లెం చెరువు తండాకు చెందిన చంటితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఈనెల ఏడవ తారీఖు రోజు మృతుడు రాజుకు తెలియడంతో..ఇద్దరినీ మందలించాడు. మృతుడి భార్య హిమబిందు ప్రియుడు చంటి తో కలిసి ఎలాగైనా రాజును చంపి..అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. చంటి అతని స్నేహితుడైన కుర్ర రాకేష్ కు అతనికి సహకరించాలని కోరాడు.
ఈ నెల 7వ తేదీ సాయంత్రం ఒక సుత్తి కొని పొలంలో దాచిపెట్టారు. రాజు అతని భార్య హిమబిందు రాత్రి పొలం వద్దకు వెళ్లారు. ఇద్దరూ అక్కడే ఉన్న మంచం పై పడుకున్నారు. రాత్రి రెండు గంటల సమయంలో చంటి అతని స్నేహితుడు రాకేష్ వచ్చి హిమబిందువును లేపారు. దీంతో చంటి సుత్తితో రాజు తలభాగంపై కొట్టాడు. రాజు మేలుకోవడంతో హిమబిందు అతని స్నేహితుడు రాకేష్ ఇద్దరు కలిసి కాళ్లు చేతులు పట్టుకున్నారు. చంటి మరో నాలుగు సార్లు అతని తలభాగంపై కొట్టడంతో.. రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు మృతదేహాన్ని అక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో పడేశారు. మంచంపై రక్తపు మరకలు ఉండడంతో.. వాటిని నీటితో శుభ్రం చేసి మంచాన్ని పక్కన పెట్టారు. రక్తం అంటిన బెడ్ షీట్లు, సుత్తి తీసుకొని చంటి,రాకేష్ మహేశ్వరం వెళ్లిపోయారు. అనంతరం హిమబిందు వాళ్ళ భర్త రాజు కనిపించడం లేదని మృతుడి అన్న లాలూ కు ఫోన్ చేసి చెప్పింది. 8వ తేదీన మృతుడి తండ్రి రాత్లావత్ వాస్య వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో A1 మృతుడి భార్య రాత్లావత్ హిమబిందు,A2 వక్తవత్ చంటి ,A3 కుర్ర రాకేష్ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల నుంచి సుత్తి ను స్వాధీనపరచుకున్నారు. ఈ మేరకు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు . ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి , ఎస్సై కురుమూర్తి , సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య