తప్పిన పెను ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
దిశ, అలంపూర్ : ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.ద్విచక్ర వాహనాన్ని తప్పించి ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవర్ చాకచక్యంగా రోడ్డు నుండి పొలం వైపు బస్సును తీసుకెళ్లిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ పట్టణం ఫరూక్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏపీ రాష్ట్రం కర్నూలు నుండి 20 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కి బయలుదేరింది. మార్గమధ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై బోరవెల్లి నుంచి మానవపాడుకు బైక్ పై సుదర్శన్ అకస్మాత్తుగా జాతీయ రహదారి పైకి రావడంతో బస్సు డ్రైవర్ తిరుపతయ్య చాకచక్యంగా బైక్ను తప్పించి రోడ్డు నుండి పొలంలోకి బస్సును తీసుకెళ్లాడు. స్వల్పంగా బైకు బస్సు తగలడంతో సుదర్శన్ గాయాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి హైవే అంబులెన్స్ లో సుదర్శన్ ను తరలించారు. బస్సు ఒక్కసారిగా పొలంలో దూసుకొని వెళ్లడంతో ప్రయాణికులు కేకలు వేశారు. ఇప్పటివరకు ఏం జరిగిందో బస్సులో ఉన్న ప్రయాణికులకు తెలియ రాలేదు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ తిరుపతయ్య బస్సును చాకచక్యంగా నడపడంతోనే ఈ పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అభినందించారు.