lifting scheme : తుమ్మిళ్ళ ఎత్తిపోతల నీటి విడుదల విషయంలో హైడ్రామా..
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ తుమ్మిళ్ళ ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దిశ, రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ తుమ్మిళ్ళ ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తుంగభద్రా నదికి పెద్ద ఎత్తున వరద జలాలు రావడంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే విజేయుడు ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హుటాహుటిన తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్దకు చేరుకొని సిబ్బంది పై మండిపడ్డారు. సమయం 10 గంటలకు తెలిపి సమయం కాకముందే మోటార్లను ప్రారంభించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీసి మోటార్లను ఆఫ్ చేయించారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజేయుడు డెలివరీ పాయింట్ దగ్గర దాదాపు 3 గంటలు బైఠాయించారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం డీఎస్పీ సత్యనారాయణ సీఐ బాబు వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వినకపోవడంతో అడిషనల్ ఎస్పీ గుణశేఖర్ అక్కడికి చేరుకొని నిరసన విరమించాలని కోరిన వినకపోవడంతో పరిస్థితి అదుపు తెచ్చేందుకు ఐజ, మానవపాడు, శాంతినగర్, రాజోలి పోలీస్ సిబ్బందితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడు వారి మద్దతు దారులను అరెస్ట్ చేసి శాంతి నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రైతులు పంటలకు నీరు లేక ఎండిపోతుంటే నీరు వదిలే విషయంలో ఈ రాజకీయం ఏంటని ఉన్నతాధికారులను ఎమ్మెల్యే విజేయుడు ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డెలివరీ పాయింట్ దగ్గరకు చేరుకొని మీడియాతో మాట్లాడుతూ రైతు కళ్లల్లో ఆనందం చూడడానికి రక్తం దారపోశనని, సాంకేతిక లోపల కారణంగా మోటార్లను ఆఫ్ చేశారని, ఆర్డీఎస్ గురించి అవగాహన లేకుండా రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో మల్లమ్మ కుంట రిజర్వాయర్ కొరకు భూమి సేకరణ పనులు సాగుతున్నాయని త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. ఎట్టకేలకు మోటార్లను ప్రారంభించి పూజ చేసి నీటిని ఆర్డీఎస్ కాలువకు వదిలారు.