srisailam Project : నాగార్జునసాగర్ వైపు బిరా బిరా కృష్ణమ్మ..
ఎగువ ఉన్న కర్ణాటకలోని సుంకేసుల బ్యారేజీ దాని దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ వడివడిగా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ వైపు బీర బీర కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది.
దిశ, అచ్చంపేట : ఎగువ ఉన్న కర్ణాటకలోని సుంకేసుల బ్యారేజీ దాని దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ వడివడిగా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ వైపు బీర బీర కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద జలాలు చేరుతున్నాయి. బుధవారం మూడు గంటల వరకు ప్రాజెక్టు అధికారులు పది గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు నీటిని వదులుతున్న నేపథ్యంలో వరద జలాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు తదుపరి ఎగువ నుంచి కొద్దిపాటిగా వరద తగ్గడంతో మధ్యాహ్నం తరువాత 8 గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,55,888 లక్షల క్యూసెక్కుల వరద అలాగే సుంకేసుల బ్యారేజీ నుంచి 16, వేల 125 క్యూసెక్కుల వరదతో మొత్తంగా 3. 62,411 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు కాగా 215.87 టీఎంసీల సామర్థ్యం నీటి నిలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం నాటికి 884.50 అడుగులు చేరుకోగా 212.9190 టీఎంసీల సామర్థ్యం చేరుకుంది.
అంతే వేగంగా సాగర్ వైపు...
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 8 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని 2.23,128 లక్షల క్యూసెక్కుల వరద జలాలు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఉగ్రరూపంతో పరుగులు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 24,917 క్యూసెక్కులు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35, 315 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ వైపు వదులుతున్నారు.