సోమశిల టూ శ్రీశైలం…రెండో ధపా లాంచీలో అద్భుత ప్రయాణం

పర్యాటక రంగంలో ఆంధ్రకు పాపికొండలు మణిహారంగా నిలిచితే...తెలంగాణకు పాలమూరు పాపికొండలుగా..

Update: 2024-11-09 12:13 GMT

దిశ, కొల్లాపూర్: పర్యాటక రంగంలో ఆంధ్రకు పాపికొండలు మణిహారంగా నిలిచితే...తెలంగాణకు పాలమూరు పాపికొండలుగా.. నల్లమల కొండలు ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన లాంచీ రెండో విడత శనివారం ఉదయం 10 గంటలకు కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలానికి 120 మందితో కార్తీక మాసాన బయలుదేరింది.లాంచీ ప్రయాణం కోసం శుక్రవారం సాయంత్రం వరకు ఆన్ లైన్ లో పర్యాటకులు,భక్తులు బుక్ చేసుకోగా, శనివారం బయలుదేరారు. ఈ లాంచీలో 120 సీట్ల కెపాసిటీ కాగా 120 మంది పర్యాటకులు ప్రయాణించడం విశేషం. అయితే తొలిసారిగా ఈ నెల 2వ తేదీన సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం కోసం బుక్ చేసుకున్న 80 మందితో పర్యాటక శాఖ ప్రారంభించిన విషయం తెలిసిందే.

90 కిలోమీటర్ల దూరం, 6 గంటల పాటు కృష్ణానదిలో అలలపై ,ప్రయాణంలో వీచే చల్లటి గాలులు,ఆహ్లాదకర వాతావరణంలో మధురానుభూతిని పొందుతూ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలానికి చేరుకోనుంది. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం భక్తులు ఆదివారం తిరిగి సోమశిల కు లాంచీలో చేరుకోనున్నారు. సోమశిల నుంచి తూర్పున ఉన్న శ్రీశైల క్షేత్రానికి లాంచీలో మార్గమధ్యంలో నదికి ఇరువైపులా దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య మార్గమధ్యంలో నల్లమల అందాలు ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. అందులో మల్లయ్య శిల పుణ్యక్షేత్రం,అమరగిరి గ్రామం, కోతిగుండు,చీమలతిప్ప ద్వీపకల్పం,గుండ్లపెంట చెంచు గూడెం,చుక్కల గుండం(ఈ ప్రదేశం లో కొద్ది దూరం పగలు ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి).అక్కామహదేవి గుహాలు, శ్రీశైలానికి చేరుకుంటారు. ఈమారు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు,భక్తులు శ్రీశైలం లాంచీ ప్రయాణం లో ఉన్నారు. అయితే లాంచీ ప్రయాణం ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర పర్యటన శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సైదులు, కొల్లాపూర్ పార్సెల్ ఏంజెల్ చంద్రశేఖర్, నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పర్యవేక్షించారు.

ప్యాకేజీ వివరాలు...

సోమశిల నుంచి శ్రీశైలానికి పెద్దలకు రానుపోను రూ,3వేలు, వన్ వే రూ,2వేలు,పిల్లలకు రానుపోను రూ, 2400 లు, వన్ వే రూ, 1600 లు వసూలు చేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.


Similar News