ఆత్మగౌరవ సభ ఆలస్యంపై జనాగ్రహం.. ముఖ్య నేతల ప్రసంగంలోనే ..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహణ ఆలస్యం కావడం పట్ల ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు.
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహణ ఆలస్యం కావడం పట్ల ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. ముఖ్య అతిథులు ప్రసంగిస్తున్న సమయానికే ప్రధాన గ్యాలరీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. మూడు గంటలకు ప్రారంభిస్తామని చెప్పి సుమారు నాలుగు గంటల ఆలస్యం చేయడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ప్రసంగిస్తున్న సమయానికి ప్రధాన గ్యాలరీలన్నీ ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి.
తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయకపోవడం పై జనం ఇబ్బంది పడ్డారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగం మరో 10 నిమిషాలు ఉంటుంది ఆగండి అంటూ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు చిన్నారెడ్డి జనాన్ని బ్రతిమిలాడుతూ కనిపించారు. వారి మాటను గౌరవిస్తూ మరో 10 నిమిషాలు వేచి చూసి అందరూ వెళ్లిపోవడంతో కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వీటిని వీడియోల రూపంలో బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.