మోదీని చూసే దేశ ప్రజలు బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు

దేశంలో ప్రధాని మోదీని చూసి ప్రజలు ఓటు వేస్తారు.

Update: 2024-03-27 12:42 GMT

దిశ, జడ్చర్ల : దేశంలో ప్రధాని మోదీని చూసి ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని, మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ఇండియా కూటమే గుర్తించడం లేదని ఆమె విమర్శించారు. బుధవారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని నియోజకవర్గ స్థాయి బీజేపీ పార్టీ పార్లమెంటు కార్యాలయాన్నిఆమె ప్రారంభించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలో మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని, రాహుల్ గాంధీని ఇండియా కూటమే ప్రధాని అభ్యర్థిగా గుర్తించడం లేదని ఆమె అన్నారు. తెలంగాణలోని 17 సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అని ఆమె ప్రశ్నించారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో 28 పార్లమెంటు స్థానాలకు 24 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని అలాగే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి, చరిష్మాను చూసి కాదని బీఆర్ఎస్ అవినీతి అక్రమాలను ,భూ కబ్జాలను భరించలేక ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు.

ఏది ఏమైనా మరోసారి దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు రా పోతుల శ్రీనివాసులు, ముచ్చర్ల జనార్దన్ రెడ్డి సాహితీ రెడ్డి, పల్లె తిరుపతి నాగరాజు, మధు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News