సమస్యల వలయంలో పాలమూరు ఆస్పత్రి
ప్రజలకు సరైన వైద్య సేవలు అందించి వారి ప్రాణాల్ని కాపాడాల్సిన పాలమూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి రోజురోజుకూ విమర్శల పాలవుతోంది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజలకు సరైన వైద్య సేవలు అందించి వారి ప్రాణాల్ని కాపాడాల్సిన పాలమూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి రోజురోజుకూ విమర్శల పాలవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిలో 660 బెడ్లు ఉన్నాయి. వైద్యులు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 400 మందికి పైగా పనిచేస్తున్నారు. పలు కారణాల వల్ల ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 2000 నుంచి 3000 దాకా వివిధ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం ప్రజలు వస్తున్నారు. వీరందరికీ సిబ్బంది వైద్య సేవలు అందించడంలోనూ, రోగులతో వ్యవహరించే తీరులోనూ చిరాకును ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మూడు నెలలుగా పని చేయని సీటీ స్కాన్..
వైద్య పరీక్షలను నిర్ధారించడంలో ప్రధాన భూమికను పోషించే సీటీ స్కాన్ గత మూడు నెలలుగా పని చేయకపోవడంతో వైద్య సేవల కోసం వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది. సీటీ స్కాన్ ను అందుబాటులోకి తేవడానికి నిధులు లేవు అని అధికారులు సమాధానం చెబుతున్నారు. దీనికి తోడు ప్రధానమైన గుండె, నరాల బలహీనతలకు సంబంధించిన డాక్టర్ లేకపోవడంతో సంబంధిత వ్యాధులతో బాధపడే ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇతర ప్రైవేటు ఆసుపత్రులు, లేదా హైదరాబాద్ వెళ్లి పెద్ద ఎత్తున ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
అందుబాటులో లేని మందులు...
ఆసుపత్రికి వచ్చి పరీక్షల అనంతరం వైద్యులు రాసే మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. పూర్తిస్థాయిలో మందుల సరఫరా లేకపోవడంతో డాక్టర్లు ప్రైవేట్ మెడికల్ స్టోర్లకు రాస్తున్నారు.. ఇదే అదునుగా భావించి మెడికల్ షాప్ లో యాజమాన్యాలు మందుల కోసం వెళ్లే వారిని నిలువునా ముంచేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు..
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న సంఘటనలు వైద్యం కోసం వచ్చే వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ మధ్య పసి బాలుడు.. మరో బాలింత మరణించడం, ఇటీవల జడ్చర్ల కు చెందిన రవీంద్ర అనే యువకుడు ఇంజక్షన్ మందు వికటించి మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సంఘటనలు ఇలా ఉంటే .. ఆస్పత్రిలో సిబ్బంది వ్యవహరించే తీరు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఈ కారణంగానే మూడు నెలల క్రితం ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
అందుబాటులోకి రాని సూపరింటెండెంట్..
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, వైద్య సిబ్బంది కొరత, తదితర వివరాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ను వివరణ కోరేందుకు దిశ ప్రతినిధి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేకపోయారు.