ఆగని ప్లాస్టిక్ భూతం.. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి..

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలోనూ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది.

Update: 2024-11-03 02:39 GMT

దిశ, వనపర్తి టౌన్ : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలోనూ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. 2013లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40 మైక్రాన్లలోపు ఉన్న పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధించింది. ఇది కేవలం అమలులో చెప్పుకోవడానికి తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదు. నియంత్రించాల్సిన అధికారులు వినియోగానికి దూరంగా ఉండాల్సిన ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులు నామమాత్రంగా చూసీచూడనట్లు వ్యహరిస్తున్న తీరు పై పర్యావరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కలిపి రోజువారీగా దాదాపు 45 నుంచి 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను మున్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తే, దాంట్లో సుమారుగా 12-15 మెట్రిక్ టన్నుల వరకు వ్యర్థ ప్లాస్టిక్ ఉంటుంది.

అన్నిటిలోనూ ప్లాస్టిక్ కవర్లు..

జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో నిత్యావసర సరుకులతో పాటు అన్ని రకాల వస్తువులు తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. జిల్లాలో 30 - 35 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ తో పాటుగా వాటికి అనుబంధమైన వ్యర్థాలను తరలిస్తున్నారంటే ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు ఎంత మోతాదులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇళ్ల నుంచి సేకరించే చెత్తలో ఇంత మొత్తంలో ప్లాస్టిక్ పొగవుతోందంటే జిల్లా కేంద్రంలో ఉన్న హోటల్స్, వాణిజ్య దుకాణాలు గుట్టు చప్పుడు కాకుండా క్రయవిక్రయాలు చేస్తున్నారు.

మున్సిపాలిటీలో కొరవడిన పర్యవేక్షణ..

ప్లాస్టిక్ వినియోగం పై మున్సిపల్ ఉన్నతాధికారులు ఉదాసీన వైఖరి ఆలంబిస్తున్నారనడంతో అతిశయోక్తి లేదు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ నివారించే ప్రయత్నాలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ నివారణ పై చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు దృష్టి సారించడం లేదని చెప్పాలి. ఏడాదికాలమవుతున్నా ఇప్పటివరకు జిల్లా కేంద్రంతో పాటు, ఐదు మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ వినియోగించే దుకాణాలపై ఎలాంటి దాడులు గానీ, జరిమానాలు విధించకపోవడంతో షాపుల్లో, షాపింగ్ మాల్లలో గుట్టు చప్పుడు కాకుండా క్రయవిక్రయాలు జరుగుతున్నారు.

ప్లాస్టిక్ నివారణ పై కనిపించని ఆచరణ..

కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ శ్వేతా మహంతి ఆమె పాలనలో ప్లాస్టిక్ నివారణకు ఒక అడుగు ముందుకేస్తూ క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ నివారించే ప్రయత్నాలు చేసినట్లు పలువురు గుర్తు చేశారు. ప్లాస్టిక్ వివరణలో అందరూ భాగస్వాములు అయితే తప్ప పూర్తి స్థాయిలో నివారించడం సాధ్యం కాదని అవగాహన కల్పించారు. తప్పనిసరిగా జ్యూట్ బ్యాగ్స్, బట్ట సంచులు వాడాలి. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ప్రజలను చైతన్యవంతం చేసి ప్లాస్టిక్ పై యుద్ధం తప్పక చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్త్తు తరాలకు ప్లాస్టిక్ వల్ల విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వ్యవహరించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News