తలోదారి.. ఎవరికి వారీగా వ్య వహరిస్తున్న జాతీయ పార్టీల నేతలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నది అక్షర సత్యం. కానీ ఆ అవకాశాలను ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సద్వినియోగపర్చుకోలేకపోతున్నాయి.

Update: 2023-02-17 03:31 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నది అక్షర సత్యం. కానీ ఆ అవకాశాలను ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సద్వినియోగపర్చుకోలేకపోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య సమన్వయం లోపించడంతో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలకు మంచి పట్టున్నప్పటికీ నేతలు మధ్య సఖ్యత కొరవడడం అధికార బీఆర్ఎస్ పార్టీకి కలిసివస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అధికార పార్టీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తుండగా.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా పోటీ పడుతుండగా ఉమ్మడి జిల్లాలో మాత్రం అధికార పార్టీని ఢీకొట్టేందుకు సరైన విధంగా అడుగులు వేయకపోవడంతో బీఆర్ఎస్ కు కలిసి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ విఫలం అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అచ్చంపేట, కొడంగల్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి పట్టు ఉన్నప్పటికీ ఆ పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు విఫలం అవుతున్నాయి.

దృష్టి సారించని జాతీయ పార్టీలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నియోజకవర్గాలలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పవనాలు ఇస్తున్నప్పటికీ.. వాటిని క్యాచ్ చేసుకునే విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నామ మాత్రంగా ఉన్నాయి. కొల్లాపూర్, కల్వకుర్తి తదితర ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ నేతల నిర్లక్ష్యం, ఇతర కారణాల పార్టీ బలహీనం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి మహబూబ్ నగర్, నారాయణపేట, కల్వకుర్తి, గద్వాల, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. కానీ ఈ నియోజకవర్గాలలో నేతల సఖ్యత సరిగా లేకపోవడం వల్ల పార్టీ లు ఆశించిన స్థాయిలో బలోపేతం కాలేక పోతున్నాయి. అలంపూర్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి తదితర ప్రాంతాలలో కాంగ్రెస్ కు మంచిపట్టుకున్నప్పటికిని దానిని నిలుపుకునే ప్రయత్నం చేయలేకపోతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Tags:    

Similar News