కేఎల్ ఐ మేజర్ -2 కాల్వకు గండి
పొలాలకు సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి 8 కాల్వకు అనుసంధానంగా నిర్మించిన మేజర్-2 కాలువకు శనివారం తెల్లవారుజామున గండిపడింది.
దిశ, గోపాల్ పేట : పొలాలకు సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి 8 కాల్వకు అనుసంధానంగా నిర్మించిన మేజర్-2 కాలువకు శనివారం తెల్లవారుజామున గండిపడింది. ఈ కాలువ ద్వారా గోపాల్పేట శివారులోని పొలాలకు నీరందుతుంది. ప్రధాన కాలువకు కొద్ది దూరంలోనే కాలువకు గండి పడింది. దాంతో నీరంతా పొలాల వెంట ఎర్రకుంట చెరువులోకి వెళ్తుంది.
ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు ఎర్రకుంట చెరువులోకి నీటిని తరలించేందుకు కాలువ తవ్వి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తెగిన కాలవకు వెంటనే మరమ్మతులు చేస్తే నీరు రెడ్ల కుంట చెరువులోకి వెళతాయని, లేకుంటే పొలాల వెంట వృథా అవుతాయని రైతులు చెబుతున్నారు. కాలువ తెగిన విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు.