Jedcharla: అరబిందో గరళంపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అరబిందో కంపెనీ నుంచి విడుదలవుతున్న గరళంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరో మారు గళం విప్పారు.

Update: 2024-12-17 02:07 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: అరబిందో కంపెనీ నుంచి విడుదలవుతున్న గరళంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరో మారు గళం విప్పారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పోలేపల్లి సెజ్ లో ఉన్న అరబిందో కంపెనీ నుంచి విడుదలవుతున్న కాలుష్య జలాల అంశంపై ఘాటుగా మాట్లాడిన తీరు సర్వత్ర చర్చనీయంశంగా మారింది.

చెరువులోకి కాలుష్య జలాలు..

అరబిందో కంపెనీ నుంచి విడుదలవుతున్న కాలుష్య జలాలు పలు గ్రామాలను కలుషితం చేస్తోందని కొన్ని సంవత్సరాలుగా పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రత్యేకించి ముదిరెడ్డిపల్లి గ్రామం చెరువులోకి కాలుష్య జలాలు చేరడంతో ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు, బోర్లు కాలుష్యానికి గురవుతున్నట్లు అప్పట్లో పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వెళ్లిన కాలుష్య జలాల నివారణకు సరైన చర్యలు తీసుకోలేదని ఆందోళనలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కంపెనీ కాలుష్య జలాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాలుష్యం నియంత్రణ మండలికి, ఇతర అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించి గతంలో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. కానీ, అధికారులు చర్యలు చేపట్టకపోవడం.. కాలుష్య జలాలు యధావిధిగా చెరువులోకి వస్తుండడంతో చెరువు నీటితోపాటు.. భూగర్భ జలాలు సైతం కాలుష్యమయ్యే పరిస్థితిలు నెలకొంటున్నాయి.

అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన ఎమ్మెల్యే..

అరబిందో కంపెనీ గురించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో ఘాటుగా మాట్లాడిన విధానం ప్రతిపక్ష పార్టీల నేతలను గుర్తు చేసింది. కంపెనీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో, ఆ జలాలు చెరువులోకి చేరుతున్నాయని ఎమ్మెల్యే సభలో ప్రస్తావించారు. దీనివల్ల భూగర్భ జలాలు కాలుష్యం కావడంతో.. చెరువులో ఉండే చేపలు మరణిస్తున్నాయని చెప్పారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కల్పించుకొని కంపెనీలతో ఎటువంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. ఆగస్టు 24, అక్టోబర్ 26వతేదీలలో జలకాలుష్యంపై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించి వ్యవసాయ శాఖ నుంచి నివేదికలను తెప్పించుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే కాలుష్య సమస్యలకు సంబంధించి అధికారులు అరబిందో కంపెనీ అంశంపై చర్యలు తీసుకుంటారని చుట్టుపక్కల గ్రామస్తులు భావిస్తున్నారు.

పరిశోధనలు జరగాలి..

అరబిందో కంపెనీ నుండి విడుదలయ్యే జలాలపై పరిశోధనలు జరపాలని, జరుగుతున్న నష్టాలను అంచనా వేయాలని ముదిరెడ్డిపల్లి గ్రామస్తులతో పాటు పలువురు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పంటలు, చేపల దిగుబడులు తగ్గడంతో పాటు.. భూగర్భ జలాలకు జరుగుతున్న నష్టాలపై పరిశోధనలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News