రైతు పండగతో చేతికి బలం..!
పాలమూరు జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు పండగతో చేతికి మరింత బలం చేకూరిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరు జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు పండగతో చేతికి మరింత బలం చేకూరిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో రైతు పండగ పేరుతో భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మూడు రోజుల పాటు తలపెట్టిన రైతు పండగ అన్ని కార్యక్రమాల మాదిరిగానే సాధారణంగా జరుగుతుందని అందరూ భావించారు. కానీ, కార్యక్రమాలు ఆరంభం నుంచి ముగింపు వరకు అత్యంత ఉత్సాహంగా కొనసాగాయి. 150కి పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేవిగా ఉండడం.. వాటిని తిలకించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు మాత్రమే కాకుండా వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు కూడా తమ పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు ఉండడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించారు.
మహిళలు సైతం పెద్ద ఎత్తున తమ పిల్లలను తీసుకువచ్చి స్టాల్స్ ను చూపించడంతో కార్యక్రమానికి సంబంధించి విస్తృత ప్రచారం జరిగింది. మరోవైపు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు అధిక దిగుబడులు సాధించేందుకు రైతులకు అమూల్యమైన సలహాలు సూచనలు చేయడం, మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని పర్యవేక్షించడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమానికి ప్రాధాన్యం పెరిగింది. శనివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సభకు మొదటగా లక్షమందికి పైగా తరలించాలన్న అంచనాలతో సమీకరణకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సన్నద్ధం అయ్యారు. ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భూత్పూర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా సభ జనంతో కళకళలాడింది. దీనికి తోడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రైతుల సంక్షేమం కోసం చేసిన ఖర్చు.. రుణమాఫీ వివరిస్తూ.. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, చమత్కారవంతంగా.. ఆసక్తికరంగా ప్రసంగించడంతో పార్టీ శ్రేణుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమం ముగిసే వరకు దూరప్రాంతాల నుంచి వచ్చిన జనం ప్రసంగం ముగిసే వరకు ఆసక్తిగా వినడం ప్రత్యేకతలను చాటింది. ఊహించిన దానికన్నా జనం ఎక్కువగా రావడం.. ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ సభ మంచిఫలితాలను ఇవ్వగలదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ స్ఫూర్తిని కొనసాగించి పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించాలని సాధన కార్యకర్తలు సూచిస్తున్నారు.
కలిసి రానున్న పాలమూరుకు వరాల ప్రకటనలు..
పాలమూరు బిడ్డగా బూర్గుల రామకృష్ణారావు అనంతరం 70 ఏండ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకు లభించిందని, తన కరువు జిల్లాను అభివృద్ధి చేసుకోకుంటే చరిత్ర తనను క్షమించదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ప్రతి ఏటా 20వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో రూ.లక్ష కోట్లు కేటాయించి జిల్లాలో ఎత్తిపోతల పథకాలను, పెండింగ్ ప్రాజెక్టులను, పాలమూరు - రంగారెడ్డి, నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించడం, ఈ ప్రాంతానికి పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇవ్వడంతో.. పార్టీ శ్రేణుల్లోనే కాకుండా.. సాధారణ జనానికి సైతం నమ్మకం కలుగుతుండడంతో ఉత్సాహానికి అవధులు లేకుండా పోతున్నాయి.