ఆక్రమణదారుల హడల్.. అర్ధరాత్రి అక్రమ నిర్మాణాల కూల్చివేత

రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణదారుల గుండెల్లో

Update: 2024-08-30 01:58 GMT

దిశ,మహబూబ్‌నగర్ ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రా పాలమూరులోనూ ప్రవేశించినట్లు అయ్యింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో చెరువులు, నాలాల ఆక్రమణలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. దీంతో ఆస్థాయిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ హైడ్రా ప్రవేశించడం ఖాయమని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చెరువులు, కుంటల ఆక్రమణలతోపాటు పెద్దఎత్తున ప్రభుత్వ భూములు దుర్వినియోగానికి గురయ్యాయని ఆరోపణలు వచ్చాయి. అంతేకాక ఆక్రమణలు అన్నీ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుండడంతో దాడులు ఏ క్షణంలోనైనా జరగవచ్చని భావించారు.

ఇందుకు కొంత సమయం పట్టవచ్చు అని ఊహించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హైడ్రా ని తలపించేలా గురువారం తెల్లవారుజామున రెవెన్యూ, పోలీస్ అధికారులు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్‌పల్లి 523 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయమై కొన్ని విమర్శలు వస్తున్నా వాటిని లెక్క చేయకుండా అధికార యంత్రాంగం దాదాపుగా 75ఇండ్లను కూల్చివేసింది. అక్రమంగా నిర్మాణమైన మరిన్ని ఇండ్లను గుర్తించి తప్పకుండా కూల్చి వేస్తారనే ప్రచారం జరుగుతోంది.

అందరి దృష్టి పెద్ద చెరువు పైనే..

పాలమూరు నడిగడ్డ లో ఉన్న పెద్ద చెరువు వైపు అందరి దృష్టి సారిస్తున్నారు. దాదాపుగా 96 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ చెరువు ప్రస్తుతం 56 ఎకరాలకు మిగిలిందని లెక్కలు చెబుతున్నాయి. 40 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై గత కొన్ని దశాబ్దాల నుంచి అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. అంగ బలం, ధన బలం, రాజకీయ బలం ఉన్నవారు చెరువును ఆక్రమించుకుంటుంటే రాజకీయ అవకాశవాదులు ఆక్రమణలను అడ్డుకోక పోగా కొంతమంది వారికి అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు పొలంలో నివాసాల తో పాటు ఫంక్షన్ హాల్స్, విద్యాసంస్థలు, పరిశ్రమ కేంద్రాలు తదితర ముఖ్యమైన నిర్మాణాలు ఉన్నాయి.

చెరువు ఆక్రమణ కు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు పాలమూరులో కూల్చివేతలు ఆరంభం కావడంతో నెక్స్ట్ జరిగేది పెద్ద చెరువు ఆక్రమణలపై ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. పెద్ద చెరువు తో పాటు ఏనుగొండ, పాలకొండ, అప్పనపల్లి, తదితర ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటి పైన కూడా అధికారులు దృష్టిని సారించి కూల్చివేతలు చేయడం తథ్యమని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఆక్రమణలను తొలగించి చెరువులు, కుంటలు, నాలాల స్థలాలకు విముక్తి కలిగించాలని పలువురు కోరుతున్నారు. ఈ కూల్చివేతలలో బీదలు ఎవరైనా ఉంటే వారికి ప్రత్యామ్నాయంగా ఇండ్లు కానీ, ఇంటి స్థలాలు కానీ కేటాయించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Similar News