కందనూలులో ఖాకీ, మంత్రగాళ్ళ మాయాజాలం.!
ఛు... మంతర్...! భూత ప్రేత పిశాచాలను తరిమెస్తామ్.. దాంపత్య జీవితం, సంతానం భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు, గ్రహణ దోషాలు, ఇలా ఒకటేమిటి ఎలాంటి వారికైనా పరిష్కారం చూపుతామ్ అంటూ
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: ఛు... మంతర్...! భూత ప్రేత పిశాచాలను తరిమెస్తామ్.. దాంపత్య జీవితం, సంతానం భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు, గ్రహణ దోషాలు, ఇలా ఒకటేమిటి ఎలాంటి వారికైనా పరిష్కారం చూపుతామ్ అంటూ నాగర్ కర్నూల్ జిల్లాలో గల్లీ గల్లీకి మంత్రగాల్లు, బాబాలు స్వామీజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకొని భూములను, డబ్బులను చివరకు మాన ప్రాణాలను సైతం కాజేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఓ బాబా తాయితలు కడతానని ఓ మహిళను లొంగదీసుకుని.. కొంతకాలం సహజీవనం చేసి ఆస్తులను సర్వం కాజేశాడు.
ఆ సంఘటన మరవక ముందే జిల్లా కేంద్రానికి చెందిన సత్య నారాయణ యాదవ్ అనే మంత్రగాడు ఓ అమాయక మహిళకు మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్న భార్యా భర్తలిద్దరినీ తిరిగి కలుపుతానని మాయమాటలు చెప్పి తన పేర ఉన్న భూములు, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే గతంలోనే ఇలేగే ఓ వ్యక్తిని మంత్రాల పేరుతో మోసగించాడు. ఈ నిజస్వరూపం తెలుసుకున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా తలపై బండాయితో మోదీ సదురు మంత్రగాడే చంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పోలీసుల విచారణలో విషయం బయట పడటంతో అందులో నుండి తప్పించడం కోసం సదురు పోలీసు అధికారి లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత బాధితురాలికి చెందిన కోట్ల విలువచేసే భూములను సదురు పోలీసు అధికారికి మామ వరుస అయ్యే గొల్ల అనంతయ్య పేరుతో 2 గుంటలు, ఒడ్ల శివ కుమార్ అనే వ్యక్తి పేర అర గుంట భూమిని నేరుగానే రిజిష్టర్ చేయించాడు.
మరో 155 గజాల ప్లాటును సత్యనారాయణ యాదవ్ (మంత్రగాడు) పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనితో తాను మోసపోయిన విషయాన్ని భర్తకు చెప్పడంతో ఇద్దరు కలిసి కుటుంబ పెద్దలు కాలనీవాసులతో కలిసి మంత్రగాడిని నిలదీయగా వారిపైనే బెదిరింపులకు దిగాడు. ఓ హత్య నేరంలో బాధితురాలిని చేర్చి వారిపై ఉన్న ఒత్తిడి తగ్గించుకోవాలని కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోందని అందుకే తన బంధువుగానే పోలీస్ స్టేషన్లో పేరు నమోదు చేయించినట్లు అనుమానిస్తున్నారు. మొత్తంగా బాధితురాలని హత్యలో భాగస్వామ్యం చేస్తే భూముల జోలి మళ్లీ ఎత్తకుండా కేసును మొత్తానికి క్లోజ్ చేసేందుకు సదరు పోలీసు అధికారి, మంత్రగాడు ఇద్దరూ కట్టుకథ అల్లినట్లు స్పష్టంగా అర్థం అవుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ మనోహర్ ను కలిసి తన గోడును వెల్లబోసుకుంటూ సదురు పోలీస్ అధికారి, మంత్రగాడిపై ఫిర్యాదు చేశారు.
ఇలాంటి వారిని కటినంగా శిక్షించాలి
సత్యనారాయణ యాదవ్ అనే వ్యక్తి బిజెపి పార్టీ సభ్యత్వం పొంది గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీలో నిలబడ్డాడు. కానీ గత కొద్దిరోజులుగా తన ప్రవర్తన బాగోలేక మండలం తీరు మార్చుకోవాలని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పిన వినలేదు. మంత్రాల పేరుతో జనాన్ని మోసగిస్తూ భూములు ప్లాట్లు నగదు తో పాటు శారీరకంగాను మహిళలను వేధిస్తున్నట్లు తెలిసింది మరికొన్ని హాత్యా నేరాల్లో కూడా భాగస్వామి ఉన్నట్లుగా తెలిసింది.:-దిలీప్ చారి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ ఇన్చార్జ్ నాగర్ కర్నూల్
హైదరాబాద్లో నాకు ఎంతో మంది బంధువులు ఉన్నారు
హైదరాబాద్ నగరంలో ఎంతోమంది బంధువులు కుటుంబ సభ్యులు ఉన్నారు. వారెవరో తప్పు చేస్తే నా పేరు చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు. బాధితులకు న్యాయం చేసేలా విచారించి చర్యలు తీసుకుంటాం.:- జక్కుల హనుమంతు, సీఐ నాగర్ కర్నూల్