పాలమూరు ప్రాజెక్ట్ సచ్చిన బర్రెతో సమానం: మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చచ్చిపోయిన బర్రెతో సమానమని డీసీసీ ప్రెసిడెంట్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ షాకింగ్
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చచ్చిపోయిన బర్రెతో సమానమని డీసీసీ ప్రెసిడెంట్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యకర్త స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది నీళ్ల రాజకీయానికి తెరలేపిందని.. ఎన్జీటీలో స్టే ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరుస్తున్నామని ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు.
ప్రతిరోజు రెండు టీఎంసీల నీరు ఎత్తిపోస్తామని చెప్పి ఒక టీఎంసీకే కుదించారని.. ప్రస్తుతం అది కూడా గతి లేదని మండిపడ్డారు. అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష్మీ చెన్నకేశవ, ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పూటకో మాట చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీకి అమ్ముడుపోకుండా నిలబడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2వేల కోట్లు నిధులు ఇచ్చాడని చెప్పుకోవడం తప్పితే ఆ నిధులు ఎక్కడ పోయాయో చెప్పలేదన్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రాజెక్టులు ప్రస్తుతం ఎన్ని ప్రారంభం అయ్యాయి ఎన్ని పూర్తయ్యాయో చెప్పాలన్నారు.
నిజంగా అచ్చంపేట అభివృద్ధి కోసం ప్రాజెక్టులను పూర్తిచేయాలని చిత్తశుద్ధి ఉంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ డిక్లరేషన్ కేటాయింపు లెక్కలు, నిధుల కేటాయింపు లెక్కలు, సర్వే రిపోర్టు, భూసేకరణ పనులు పూర్తయిన ధ్రువపత్రాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. అదే కనుక నిజం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం స్వయంగా నేనే చేస్తానంటూ ప్రకటించారు.
లేదంటే పేడతో, మద్యంతో అభిషేకం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోసారి అచ్చంపేట ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు. ఎస్టీ రిజర్వేషన్ పెంపు చేస్తున్నట్లు అచ్చంపేట నియోజకవర్గంలో కరపత్రాలు వాల్ పోస్టర్లు రిలీజ్ చేసి తెగ హంగామా చేశారని.. చివరికి బజ్జీల బండి దగ్గర బజ్జీలు కట్టుకోవడానికి కూడా కరపత్రాలు ఉపయోగంలోకి రాలేదని విమర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు తదితరులు హాజరయ్యారు.