అభివృద్ధిపై దృష్టి సారించేనా..అడ్డు అదుపు లేకుండా ఇసుక, మట్టి దందా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు నెలలు మినహాయించి మిగిలిన నాలుగు నెలలు ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి పనులు. సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు నెలలు మినహాయించి మిగిలిన నాలుగు నెలలు ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల తాగునీరు, సాగునీటి సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన కోడ్ ముగియడంతో ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు అభివృద్ధి, ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.
రివ్యూలు ఏవీ..!?
వర్షాకాలం ఆరంభమయ్యింది. రైతులకు సంబంధించి విత్తనాలు, ఎరువులకు సంబంధించి వ్యవసాయ శాఖ, ఇతర ఉన్నత అధికారులతో జిల్లాలు, నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు జరగాల్సిన సమయమైనా కానీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చి కోడ్ ముగిసినా ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరగక రైతులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడంతో పలు గ్రామాలలో తాగునీటి సమస్యలు నెలకొన్నాయి. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలు అవుతున్నారు. మరోవైపు ఇదే అదునుగా భావించి అక్రమ వ్యాపారాలు చేసేవారు ఇసుక, మట్టిని తరలిస్తున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు.. ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించకపోవడంతో అక్రమ దందాలు జోరుగా సాగుతున్నాయి.
నిలిచిపోయిన ఎత్తిపోతల పనులు..
ఉమ్మడి పాలమూరు జిల్లా కరువును అధిగమించేందుకు చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎక్కడికి ఇక్కడ నిలిచిపోయాయి. వీటితోపాటు అచ్చంపేట, అలంపూర్ నియోజకవర్గాల లోని ఆయా మండలాలకు సాగునీటిని అందించేందుకు చేపట్టవలసిన ఎత్తిపోతల పై ఇప్పటివరకు సమీక్షలు జరగలేదు.. ఎమ్మెల్యేలు ఎన్నికైన మొదట్లో జిల్లా పరిషత్ సమావేశాలు జరిగిన ఆ సమావేశాలలోనూ ఎత్తిపోతల అంశాల ప్రస్తావన రాలేదు.
మందగించిన ఎమ్మెల్యేల పర్యటనలు..
ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో జరుపాల్సిన పర్యటనలు పూర్తిగా మందగించాయి. ఇద్దరు ముగ్గురు మినహాయించి మిగతా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నిక ముగిసిన తర్వాత టూర్లకు వెళ్లగా.. మిగతావారు నామమాత్రంగా నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారే తప్ప, ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై దృష్టి సాధించలేకపోతున్నారు. ఎవరైనా నాయకులు కార్యకర్తల ఇండ్లల్లో ఉన్న ఫంక్షన్లకు.. అనారోగ్యాలతో ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్లడం మినహాయిస్తే, మిగతా చెప్పుకోదగిన కార్యక్రమాలకు హాజరు కావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అందుబాటులోకి రాని సేవలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కొన్ని నియోజకవర్గాలలో ఆస్పత్రులు ఆరంభం అయ్యాయి. కానీ, ఆ ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించడం.. సిబ్బందిని నియమించడం జరగలేదు. దీంతో ఆస్పత్రుల సేవలు ప్రజలకు అందడం లేదు. దీనితోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక నిర్మాణాలు పూర్తి అయిన వాటిని ఇప్పటివరకు అందుబాటులోకి తేలేదు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వెంటనే ప్రధాన సమస్యలపై దృష్టి సారించి.. అధికారులతో సమీక్షించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.