devotees : బాల బ్రహ్మేశ్వర స్వామి ఆర్జిత సేవల సమయంలో మార్పులు..
ఉత్తర వాహిని తుంగభద్ర తీరంలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
దిశ, అలంపూర్ టౌన్ : ఉత్తర వాహిని తుంగభద్ర తీరంలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు తెల్లవారు జామునే తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి ఆలయం ముందు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి అర్చనలు నిర్వహిస్తున్నారు.
స్వామి వారి ఆర్జిత సేవా వేళల్లో మార్పులు..
కార్తీక మాసం సందర్భంగా బాల బ్రహ్మేశ్వరస్వామి ఆర్జిత సేవా సమయంలో మార్పులు చేసినట్టు ఈఓ తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఆదివారం, సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, తిథులలో ప్రాతఃకాల మహా మంగళహారతి పూజలు తెల్లవారుజామున 5:30 గంటలకు, అభిషేకాలు ఆరు గంటలకు నిర్వహించనున్నారు. మిగితా రోజులలో మంగళ హారతి యధావిధిగా 6 గంటలకు, అభిషేకాలు 6:30 గంటలకు నిర్వహించబడును. ప్రతి ఆదివారం సోమవారం ఏకాదశి పౌర్ణమి అమావాస్య తిధులలో స్వామివారి ఆలయంలో విరామ సమయం ఉండదు. భక్తులందరూ గమనించగలరని ఈవో పురేందర్ తెలిపారు.