గద్వాలకు మహర్దశ.. వరాల జల్లు కురిపించిన కేసీఆర్
జోగులాంబ గద్వాల జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. మెడికల్ కళాశాలతో పాటు గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
దిశ, గద్వాల/గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. మెడికల్ కళాశాలతో పాటు గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాలు, మండలాల అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేస్తానన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ గద్వాలలో కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలు ప్రారంభించారు.
తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కరువు కాటకాలకు నిలయమైన ఉమ్మడి పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులను వినియోగించడం వల్ల పచ్చని పంటలతో కళకళలాడుతోందన్నారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నీటి వాటాను దక్కించుకోవడంతో పాటు గట్టు, తదితర ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో పూర్తిగా కరువును పారదోలుతానన్నారు. కాగా, సీఎం 13 నిమిషాలు మాత్రమే ప్రసంగించడంతో ప్రజలు కొంత అసహనానికి లోనయ్యారు.
రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి
జోగులాంబ గద్వాల జిల్లా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ జిల్లాలో పర్యటించాను. సాగునీరు అందని పరిస్థితులు, కరువు కాటకాలు కన్నీళ్లు తెప్పించాయని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జోగులాంబ గద్వాల జిల్లాలో నీటి వనరులను మెరుగుపరుచుకున్నామన్నారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల పథకం ద్వారా చేజారిపోయిన నీటి వాటాను దక్కించుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు. గట్టు ఎత్తిపోతల పథకం, తదితర పనులను పూర్తి చేస్తే గద్వాల జిల్లాలో కరువు పూర్తిగా పోతుందన్నారు.జిల్లా అభివృద్ధిలో భాగంగా మెడికల్ కళాశాలను మంజూరు చేశామన్నారు.
గద్వాల మున్సిపాలిటీకి 50 కోట్లు, జిల్లాలో మిగిలిన మునిసిపాలిటీల అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు, గ్రామాలు, మండలాల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మహమ్మద్ అలీ, ఎంపీలు శ్రీనివాస్ రెడ్డి, రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యేలు డాక్టర్ అబ్రహం, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రటి ఎండల్లో భారీగా జనం...
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచే ఆయా గ్రామాలకు చెందిన నాయకులు జనాన్ని ప్రత్యేక వాహనాలలో సభాస్థలికి తరలించారు. ఒకవైపు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం సాయంత్రం 6 గంటల వరకు ఎదురుచూస్తూ ఉన్నారు. సభలో ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రసంగాలు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ప్రసంగించడం వల్ల ఆయన ఎక్కువ సమయాన్ని ప్రసంగానికి కేటాయిస్తారు.. మరిన్ని వరాల జల్లులు కురిపిస్తారు.. ప్రతిపక్షాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారని ఆశించారు. హెలిక్యాప్టర్లో వెళ్లాల్సి ఉండడంతో కేవలం 13 నిమిషాలు మాత్రమే ప్రసంగించి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కావడంతో జనం ఒకింత అసహనానికి గురయ్యారు.
Also Read: ‘ఆమె’కు అందలం అందని ద్రాక్షే.. రాష్ట్రంలో మహిళలకు అడుగడుగునా వివక్షే..!