స్వర్ణ లాంటి విషాదకర సంఘటన అచ్చంపేటలో మరోటి జరగొద్దు: భరత్
నల్లమల ప్రాంతానికి చెందిన స్వర్ణ సుఖ ప్రసవం కోసం సుమారు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి...BRS Leader Barath Comments
దిశ, అచ్చంపేట: నల్లమల ప్రాంతానికి చెందిన స్వర్ణ సుఖ ప్రసవం కోసం సుమారు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు మగ బిడ్డకు జన్మనిచ్చి తాను మరియు ఆ బిడ్డ మరణించిన సంఘటన చాలా విషాదకరమని కల్వకుర్తి జడ్పీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు భరత్ ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంతకుముందు అమ్రాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా సందర్భాలలో జడ్పీ సమావేశంలో జిల్లాలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో రాత్రిపూట పార్ట్ టైం ఉద్యోగుల నియామకం చేయాలని, డాక్టర్ డ్యూటీ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు తప్పక పొందుపరచాలని, పేషెంట్ పరిస్థితిని తదుపరి ఆసుపత్రులకు ఫాలోయింగ్ చేయాలని సమావేశాలలో ఎంత మొత్తుకున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వలన ఆ తల్లి, బిడ్డ చనిపోయేందుకు పరిస్థితులు దాపురించాయని ఆయన మండిపడ్డారు.
చాలా సందర్భాలలో జడ్పీ సమావేశల్లో ఇలా ప్రజా ఆరోగ్యంపై పోరాటం చేసి ఓడిపోయిన వ్యక్తినని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంఘటన జరిగి 72 గంటలు పూర్తయినప్పటికీ సంబంధిత అధికారులు ఎవరు స్పందించకపోవడం, బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించకపోవడం చాలా విషాదకరమన్నారు. ప్రభుత్వ అధికారుల నుండి ప్రజలు వారి సేవలు ఉపయోగించుకునేందుకు స్థానికంగా ఉన్న ప్రజానీకం మరియు విద్యావంతులు నిత్యం ప్రాథమిక వైద్య కేంద్రాలను సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఆరు నెలల క్రితం అచ్చంపేటలో ఒక గిరిజన మహిళ ఆరు బయట ప్రసవించిన సంఘటనకు సంబంధించి ఎలాంటి సంబంధం లేని సూపరింటెండెంట్ పై వేటు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారని, పరిస్థితులు మాత్రం యథాతథంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న దళిత, గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వలన స్వర్ణ సుదూర ప్రాంతానికి వెళ్లి కాన్పు అనంతరం తల్లి, బిడ్డ మరణించడం హృదయాన్ని కలచి వేసిందని అన్నారు. ఇలాంటి సంఘటన అచ్చంపేటలో మరొకటి జరగకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంత సమస్యలపై తన వంతు పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నాగయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, బాలరాజు తదితరులు ఉన్నారు.