పేదల ఆకలి తీర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి
రాష్ట్రంలోని పేద ప్రజల ఆకలి తీర్చడమే కాంగ్రెస్

దిశ,నారాయణపేట ప్రతినిధి: రాష్ట్రంలోని పేద ప్రజల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణిక రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏడో వార్డులో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.ఐదు మంది లబ్ధిదారులకు సన్న బియ్యం సంచులను తూకం వేసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నాసిరకమైన దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదలు దొడ్డు బియ్యం తినలేక దళాలకు అమ్ముకున్నారన్నారు.
పేదలకు దొడ్డు బియ్యం ఉపయోగపడటం లేదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ మంచి ఆలోచనతో పేదలందరికీ ఆకలి తీర్చుతూ నేడు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇదో చారిత్రక పథకమని భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాన్ని కొనసాగించక తప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ ఇవ్వడంతో తెలంగాణ రైతులు దేశానికి కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు బియ్యం అందించే స్థాయికి ఎదిగారన్నారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణం కు వచ్చిన మహిళలను బియ్యం నాణ్యతను పరిశీలించాలని స్వయంగా ఎమ్మెల్యే మహిళలకు బియ్యాన్ని చూయించారు. ఇవే సన్న బియ్యంతో వండి పెడితే మరోసారి వచ్చి మీ అందరితో కలిసి భోజనం చేస్తానని ఎమ్మెల్యే కోరడంతో కార్యక్రమానికి వచ్చిన మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ తప్పకుండా రావాలన్నారు.
అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ గతంలో ఇచ్చే దొడ్డి బియ్యం పక్కదారి పడుతుండడంతో పేదలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ సన్న బియ్యంను దళారులకు అమ్ముకోకుండా, బియ్యంను ఉపయోగించుకోవాలన్నారు. మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, ఎండి సలీం,మార్కెట్ డైరెక్టర్లు శరణప్ప, తాహెర్ హుస్సేన్,ఆర్టీవో బోర్డు మెంబర్ రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గందె చంద్రకాంత్,మనోహర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు బండి రాజేశ్వరి,మహేష్, రమేష్, కోట్ల రవీందర్ రెడ్డి,మల్లేష్,తదితరులు పాల్గొన్నారు. కాగ నియోజకవర్గంలోని దామరగిద్ద, కోయిలకొండ, మరికల్, నారాయణపేట మండల పరిధిలో సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.