బహుజన రాజ్యాధికారమే లక్ష్యం: బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన రాజ్యాధికారమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
దిశ, తాడూరు: బహుజన రాజ్యాధికారమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మండల పరిధిలోని పాపగల్, సిరసవాడ గ్రామాలలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బీఎస్పీ జెండాను ఎగురేశారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ భవిష్యత్ నాయకులు నేటి యువకులే కాబట్టి ఆలోచించి ఈ అగ్రకుల పెత్తందారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా పనిచేసి బీఎస్పీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ పాలన అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉండకపోవడమే కాకుండా నిర్వహించిన పరీక్షలు కూడా లీకులమయంగా మార్చారని అన్నారు. ఉద్యోగాల భర్తీల కోసం నోటిఫికేషన్ వేయడం, తానే దానిని కుట్రపూరితంగా అడ్డుకోవడం కేసీఆర్ కు అలవాటైందని చెప్పారు.
పేద వర్గాలను విద్యకు, వైద్యానికి దూరం చేసి మునుపటి గడీల పాలన తేవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు. ఇటీవల జరిగిన గ్రూప్ వన్ పరీక్ష పత్రాల లీకేజీలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బహుజనులు అందరూ ఏకమై కేసీఆర్ ను గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి కుమార్, తాలూకా ఇంచార్జి పృథ్వి, లక్ష్మణ్, నాగన్న, బాలు, అంజి మహేష్, కళ్యాణ్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.