బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు తప్పవా..?
ఉమ్మడి జిల్లాలో ఉన్న మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కన్నా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార బీఆర్ఎస్ పరిస్థితులు రోజురోజుకు దెబ్బతింటున్నాయి
దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : ఉమ్మడి జిల్లాలో ఉన్న మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కన్నా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార బీఆర్ఎస్ పరిస్థితులు రోజురోజుకు దెబ్బతింటున్నాయి అన్న అంశం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గద్వాల,అలంపూర్,వనపర్తి,కొల్లాపూర్,నాగర్ కర్నూల్,అచ్చంపేట,కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాలలోనూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ పరిస్థితులు రోజురోజుకు బలహీన పడుతున్న నేపథ్యంలో సెట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.నాగర్ కర్నూల్,వనపర్తి నియోజకవర్గాలు సిట్టింగులకు ఇప్పటికీ కొంత అనుకూలంగానే ఉన్నాయి అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అలంపూర్ పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత మెరుగవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, మరికొంతమంది ముఖ్య నేతలు అధికారం పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మార్పు చెందడం ఆరంభం అయ్యాయి. పార్టీకి నష్టం జరగకూడదు అని బీసీ సామాజిక వర్గానికి దగ్గర కావాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గా గట్టు తిమ్మప్ప కు ఇటీవల కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆంజనేయులు గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నప్పటికీని పట్టు సడలకూడదు అన్న ఉద్దేశంతో తిమ్మప్పకు కూడా మళ్లీ అవకాశం ఇచ్చారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికార బీ ఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురై కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈసారి అక్కడ సెట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గెలుపు అంత సులభతరం కాదని రాజకీయ నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు అధికార పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ మేరకు ఒక ముఖ్య నాయకుడితో కేటీఆర్ సమావేశమై పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ నియోజకవర్గ అభ్యర్థుల మధ్య పోటీ రసవతరంగాసాగే అవకాశాలు ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు దీటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ప్రజల్లో ఉంటున్నారు. ఎంపీ రాములు, ఆయన కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ తో ఉన్న విభేదాలు గువ్వలకు ఆటంకంగా మారుతున్నాయి. గువ్వల,ఎంపీ మధ్య ఆధిపత్య పోరు తగ్గిన ఎన్నికలలో తప్పనిసరి ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు పార్టీ మారారు. నాగం-కూచుకుల్ల మధ్య సఖ్యత లేకపోవడం, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి కలిసి రానుంది. అయినప్పటికీ నష్టం జరగకుండా మర్రి జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నారు. వనపర్తి నియోజకవర్గంలో పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి పార్టీ మారడంతో అధికార పార్టీకి కొంత నష్టమే.. ఈ ఇరువురు ఎంపీపీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం.. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు మేఘారెడ్డి సంసిద్ధుడు అవుతుండడంతో అధికార పార్టీకి కొంత నష్టం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంత సమైక్యంగా పోరాడితే మంత్రికి ఇబ్బందులు తప్పవు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దయానీయంగా మారింది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రజల్లో, నాయకులలో ఉన్న అసంతృప్తి, ఎమ్మెల్సీ కసిరెడ్డి ఎలాగైనా ఈ ఎన్నికలలో పోటీ చేయాలన్న సంకల్పంతో ఉండడం, మిగతా నేతలు ఎక్కువమంది జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుండడం వల్ల ఆ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. అక్కడ అభ్యర్థిని మారిస్తే తప్ప ప్రయోజనం ప్రయోజనం ఉండదు అని అంటున్నారు. అల్లంపూర్ నియోజకవర్గం లో సెట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పరిస్థితి గతంలో కన్నా కొంత మెరుగైన స్థితికి చేరింది. ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి కచ్చితంగా సహకరించాలి.. లేదంటే ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పై పార్టీ అధిష్టానం పూర్తిస్థాయి లో దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.