కాంగ్రెస్‌పై ఆ సామాజికవర్గం సీరియస్.. ప్రాధాన్యత లేదని అసంతృప్తి

మాదిగ సామాజికవర్గం.. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగానే లోక్‌సభ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత లభించలేదని, అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Update: 2024-03-23 05:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాదిగ సామాజికవర్గం.. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగానే లోక్‌సభ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత లభించలేదని, అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానాల్లో (పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్) ఇప్పటికే రెండింటిని (పెద్దపల్లి, నాగర్‌కర్నూల్) మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేటాయించిన అధిష్టానం మాదిగలకు అన్యాయం చేస్తున్నదని ఆ సామాజికవర్గానికి చెందిన పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో మాదిగలు దాదాపు 80 లక్షల మంది ఉంటే మాలలు కేవలం 15 లక్షల మందే ఉన్నారని, అయినా టికెట్ల కేటాయింపులో వారికే ప్రాధాన్యత ఇస్తున్నదని, సామాజిక న్యాయం కొరవడిందని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత లభించలేదని ఫైర్ అవుతున్నారు. కొన్నేండ్లుగా ఎంపీ అభ్యర్థుల ఎంపికలో రెండు టికెట్లు మాదిగ, ఒక టికెట్ మాల సామాజికవర్గానికి ఇచ్చే విధానం అమలైందని గుర్తుచేస్తున్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజికవర్గంపై వివక్ష సరికాదని నేతలు ఒకింత తీవ్ర స్వరంతోనే రాష్ట్ర, జాతీయ నాయకత్వాన్ని తప్పుపట్టారు. గతంలో పార్టీలో ఈ పరిస్థితిని ఎన్నడూ చూడలేదని గుర్తుచేశారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం ఎవరిని మెప్పించడానికంటూ మండిపడ్డారు. మాదిగలకు అన్యాయం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

వరంగల్ స్థానం మాదిగలకే ఇవ్వాలి!

మాదిగ సామాజికవర్గానికి న్యాయం జరగాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పిడమర్తి రవి, గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వంటి నేతలు ప్రెస్‌మీట్ లు పెట్టి మరీ పార్టీ హైకమాండ్‌కు వివరించారని గుర్తుచేశారు. ఇతర పార్టీలు సైతం కాంగ్రెస్‌ను తప్పుపట్టాల్సి వస్తున్నదన్నారు. ఇప్పటికే తొమ్మిది మంది లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తుచేశారు. మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో రెండు మాలలకే దక్కాయని, మిగిలిన వరంగల్ స్థానాన్ని మాదిగలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్నందున అక్కడ కూడా మాదిగకే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. థర్డ్ లిస్టులో ఏ మేరకు ఈ సామాజిక న్యాయాన్ని పార్టీ అధిష్టానం పాటిస్తుందనే ఆసక్తి నెలకొన్నది.

ఉద్యమకారులకు ప్రయారిటీ ఇవ్వాలి

ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరినోళ్లకు కాకుండా తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసినోళ్లకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి ఈ ముగ్గురు నేతలు వేర్వేరుగా రిక్వెస్టు పెట్టారు. కేసీఆర్ గతంలో విస్మరించిన పిడమర్తి రవి, గజ్జెల కాంతంకు ఈ రెండు టిక్కెట్లు కేటాయించాలని రాష్ట్ర మాదిగ సంఘాలు గాంధీభవన్‌లోని కీలక నేతలకు వివరించాయి. ఉద్యమకారులకు ప్రయారిటీ ఇవ్వకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తగ్గే ప్రమాదం ఉన్నదని వ్యాఖ్యానించాయి. అన్ని జిల్లాల్లో మాదిగ సంఘాలు, పార్టీ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నాయని, టిక్కెట్ల విషయంలో ఏఐసీసీ మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నదని లీడర్లు స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది...?

రాష్ట్రంలో వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయని, వీటిలో రెండింటిని మాదిగలకు, ఒకదాన్ని మాలకు కేటాయిస్తామని గతంలోనే టీపీసీసీ ఒక మీటింగ్‌లో తీర్మానం చేసిందని నేతలు గుర్తుచేశారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన కుమారుడికి తప్పనిసరిగా ఎంపీ టిక్కెట్ ఇవ్వాలంటూ హైకమాండ్‌పై చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నారని, చివరకు వివేక్ కుమారుడు గడ్డం వంశీ (మాల)కే టికెట్ ఖరారైందని గుర్తుచేశారు. మరోవైపు నాగర్‌కర్నూల్‌ను తాను వదిలే ప్రసక్తే లేదంటూ మాజీ ఎంపీ మల్లు రవి ఢిల్లీ స్థాయిలో చర్చించుకొని టిక్కెట్ కన్ఫామ్ చేసుకున్నారని, ఆయన కూడా మాల సామాజికవర్గానికి చెందిన నేత అని తెలిపారు. చివరకు మాదిగలకు ఇచ్చే టిక్కెట్లలో కోత పడిందని వాపోయారు. మాదిగలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న కారణంతోనే మంద కృష్ణమాదిగ బీజేపీ వైపు మొగ్గు చూపారని, ఇప్పుడు వరంగల్ స్థానం విషయంలోనూ కాంగ్రెస్ తగిన ప్రాధాన్యత మాదిగ సామాజికవర్గానికి కల్పించకుంటే వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉన్నదనే అనుమానాన్ని, ఆందోళనను కాంగ్రెస్ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాదిగ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో కాంగ్రెస్ సైతం ఆ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని నిలబెట్టకపోతే పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమనే సంకేతాలు ఇప్పటికే బహిర్గతమయ్యాయి. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే అంతిమంగా అది బీజేపీ అభ్యర్థికి అడ్వాంటేజ్‌గా మారుతుందనే జనరల్ టాక్ వినిపిస్తున్నది.

రెండు సీట్లలోనూ గెలుపు ఖాయం : కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం

‘వరంగల్ ఎంపీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన ఉద్యమకారులకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయం. ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది మాదిగ జనాభా ఉన్నది. ఆ నిష్పత్తి ప్రకారం టిక్కెట్లు కేటాయించాల్సి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. మా సామాజికవర్గానికి జరిగిన అన్యాయాన్ని హైకమాండ్‌కు వివరించాం. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌లో 4.50 లక్షల మంది మాదిగ ఓటర్లు ఉన్నారు. వరంగల్‌లో మరో 4 లక్షలు, కంటోన్మెంట్‌లో దాదాపు 50 వేల మంది మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. ఏఐసీసీ ఆలోచించి ఆ సామాజికవర్గానికి చెందిన నేతలకు టిక్కెట్లు ఇవ్వాలి. ఫలితంగా ఆ సెగ్మెంట్లలో గెలవడంతో పాటు పార్టీకి మైలేజ్ కూడా పెరుగుతుంది’.

Tags:    

Similar News