మేడమ్ సోనియాగాంధీ!.. రేవంత్ రెడ్డి చేసే పని దానికి ఉదాహారణ.. వినోద్ కుమార్ హెచ్చరిక
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చాలని చూస్తున్నారని, ఏదో ఒక రోజు భారతదేశ చిహ్నాన్ని మార్చేందుకు ఇది ఉదహారణగా నిలుస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చాలని చూస్తున్నారని, ఏదో ఒక రోజు భారతదేశ చిహ్నాన్ని మార్చేందుకు ఇది ఉదహారణగా నిలుస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. అధికార చిహ్నం మార్పుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సోనియాగాంధీని హెచ్చరించారు. మేడం సోనియాగాంధీ.. రాచరికపు వారసత్వాన్ని సాకుగా చూపి తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని, తద్వారా తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారని తెలిపారు.
దీనికి విరుద్ధంగా, భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సారనాథ్ సింహ రాజధాని మరియు అశోక చక్రాన్ని కలిగి ఉన్న భారతీయ జెండా మరియు జాతీయ చిహ్నాన్ని ఎంపిక చేశారని, ఇది అశోక చక్రవర్తి పాలన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. తెలంగాణ చిహ్నాన్ని మార్చినట్లయితే, అది ఒక రోజు భారత జాతీయ చిహ్నంలో కూడా మార్పులకు దారితీసే ఒక ఉదాహరణగా నిలుస్తుందని వినోద్ కుమార్ హెచ్చరించారు.
కాగా ఇప్పటికే తెలంగాణలో అధికారికంగా ఉన్న టీఎస్ ను టీజీగా మార్పు చేశారు. అలాగే తెలంగాణ చిహ్నంలో కూడా మార్పులు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అంతేగాక దీనిని జూన్ 2 అవతరణ దినోత్సవం సందర్భంగా అధికారికంగా విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే తుది రూపుపై కళాకారుడు రుద్ర రాజేశంతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త చిహ్నంపై జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఒక్కొరుగా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.