స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్.. పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు!

ఆరు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నది.

Update: 2024-07-01 02:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆరు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నది. ఇందులో భాగంగా ఆరు నెలల పాలన, ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేసి ప్రజలకు వివరించాలని అనుకుంటున్నది. ఇందులో విపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ప్లాన్. ఈ రిపోర్టును పబ్లిక్‌లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ స్థాయిలో చర్చ జరగాలన్నది సర్కారు ఆలోచన. ఇందులో భాగంగానే అన్ని శాఖలకు సంబంధించి ఆరు నెలల్లో అమలైన హామీలు, అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్.. అధికారులకు ఆదేశించారు. గత ప్రభుత్వ తప్పిదాలతో పాటు అప్పట్లో అమలైన హామీల్లోని డొల్లతనం, ప్రజాధనం దుర్వినియోగం వంటివి సైతం ఈ నివేదిక ద్వారా స్పష్టం చేయాలని సర్కారు భావిస్తున్నది.

గత ప్రభుత్వంతో కంపేర్..

తమ పాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలు సైతం గత ప్రభుత్వ వైఫల్యాలతో కంపేర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలు వంద రోజుల్లో అమలైన ఐదు గ్యారంటీలు, వాటి ద్వారా ప్రజలకు కలిగిన మేలు.. ఇలాంటి వివరాలన్నింటినీ రిపోర్టు రూపంలో ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నది. గత ప్రభుత్వ ఫెయిల్యూర్, అవకతవకలు, అవినీతి, అక్రమాలను వైట్ పేపర్ రూపంలో అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేసినట్లే కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు నెలల పాలనను సైతం ప్రోగ్రెస్ రిపోర్టు రూపంలో ప్రజలకు చేర వేయాలని సర్కారు భావిస్తున్నది. గత ప్రభుత్వంతో పోలిస్తే పారదర్శకమైన పాలన అందించామని ఈ రిపోర్టు ద్వారా సర్కారు చెప్పాలని అనుకుంటున్నది.

గ్యారంటీలు ఎక్స్‌పోజ్ అయ్యేలా..

ఇప్పటికే వైద్యారోగ్యం, వ్యవసాయం, ఆర్టీసీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేవాదాయ తదితర శాఖల నుంచి సీఎంఓకు రిపోర్టు అందినట్లు తెలిసింది. మిగిలిన శాఖల నుంచీ ఇదే తరహా రిపోర్టులు అందిన తర్వాత సీఎం వాటిని పరిశీలించి సమగ్ర నివేదిక రూపంలో ప్రోగ్రెస్ రిపోర్టును తయారు చేయనున్నట్టు తెలిసింది. అయితే ఐదు గ్యారంటీల అమలు ఈ రిపోర్టులో హైలెట్ కానున్నది. ఏయే పథకం ద్వారా ఎంత మంది లబ్ధి పొందారు.. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది.. కొత్త లబ్ధిదారుల వివరాలు.. ఇలాంటి డిటెయిల్స్ అన్నీ ఆ రిపోర్టులో వెల్లడించాలని ప్రభుత్వం అనుకుంటున్నది.

బీఆర్ఎస్ తప్పిదాలు బహిర్గతం

గత ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల దారి తప్పిన నిధులు, దుర్వినియోగమైన ప్రజాధనం, ఫలితంగా అవన్నీ అర్హత లేని వారికి డైవర్ట్ కావడం వంటివి ప్రజలకు బహిర్గతం చేయాలని సర్కారు స్ట్రాటజీ రూపొందించింది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని పథకాలకు నిధులు విడుదల కాకపోవడం, ఫలితంగా పలు ప్రాజెక్టుల పనులు ఆశించిన తీరులో కంప్లీట్ కాకపోవడం, రోడ్లు- భవనాలతో పాటు ఇతర అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోవడం, కమీషన్ల రూపంలో నిధులు దారి మళ్లడం వంటి అంశాలను రిపోర్టు రూపంలో ప్రజలకు వివరించనున్నట్లు తెలిసింది.

డిక్లరేషన్ తరహాలోనే..

అసెంబ్లీ ఎన్నికల టైంలో వివిధ అంశాలపై డిక్లరేషన్‌లు ప్రకటించిన తరహాలోనే ప్రోగ్రెస్ రిపోర్టు ఉండనున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇరిగేషన్, హెల్త్, విద్యుత్, రెవెన్యూ, ఐటీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వంటి శాఖలపై సర్కార్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచడం, ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులను టార్గెట్ చేస్తుండడంతో వాటికి కౌంటర్‌గా ఈ రిపోర్టు ద్వారా ప్రభుత్వం జవాబు ఇవ్వాలని అనుకుంటున్నది. మరోసారి ఇలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా ఆ పార్టీ నేతల నోరు మూయించేందుకు ప్రోగ్రెస్ రిపోర్టు రూపాన్ని ఎంచుకున్నది. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత మైలేజ్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. సీఎం ఆదేశం మేరకు అన్ని శాఖల అధికారులూ రిపోర్టుల తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.


Similar News