ఐఎంజీ భూములు ప్రభుత్వానివే.. సుప్రీంకోర్టులో కేసు డిస్మిస్

ఐఎంజీ భారత అనే సంస్థకు కేటాయించిన భూములు ప్రభుత్వానివేనని మరోసారి స్పష్టమైంది. ఎకరం రూ.50 వేలకే కట్టబెట్టిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గతంలోనే హైకోర్టు తప్పుపట్టింది.

Update: 2024-05-03 10:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఐఎంజీ భారత అనే సంస్థకు కేటాయించిన భూములు ప్రభుత్వానివేనని మరోసారి స్పష్టమైంది. ఎకరం రూ.50 వేలకే కట్టబెట్టిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గతంలోనే హైకోర్టు తప్పుపట్టింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో ఏకంగా రూ.25 వేల కోట్ల విలువైన భూమి చేరింది. 2006 నుంచి నడుస్తోన్న ఈ భూ వివాదం మలుపు తిరిగింది. అత్యంత ఖరీదైన భూమిని ఓ అనామక కంపెనీకి కట్టబెట్టడం.. అది కూడా ఆ సంస్థ ఉద్భవించిన కేవలం నాలుగు రోజులకే అప్పగించడంపై చంద్రబాబు నాయుడిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. కేబినేట్ తీర్మానం కూడా లేకుండానే జీవో ద్వారా అప్పగించడం పట్ల 2003లో దుమారం రేగింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే ఐఏంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఇల్లీగల్ గా ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఐతే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి స్టేటస్ కో లో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

400 ఎకరాలు వెనక్కి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఐఎంజీ భారత్ తరపున బిల్లీ రావు పిటిషన్ వేశారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం మార్చి నెలలో పిటిషన్ కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు ప్రొసిజర్స్ ని ఫాలో కాలేదంటూ సుప్రీం కోర్టుకు అప్పీల్ కి వెళ్లారు. శుక్రవారం సుప్రీం కోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. భారత అత్యున్నత న్యాయ స్థానంలోనూ ఐఎంజీకి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుని సమర్ధించింది. ఆ భూ కేటాయింపు సరైంది కాదని స్పష్టం చేసింది. అప్పీల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కె.వెంకారెడ్డి ‘దిశ’కు వివరించారు. ఇక్కడ ప్రస్తుతం ఎకరం రూ.100 కోట్ల వరకు పలుకుతుందని గత ప్రభుత్వ వేలం పాటల ద్వారానే స్పష్టమవుతున్నది. ఇక దీని విలువ ఎంత అనేది అంచనా వేయొచ్చు. సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత అత్యంత విలువైన భూ వివాదంలో ప్రభుత్వం గెలిచింది.

ఐఎంజీ వివాదం

ఐఎంజీకి భూమి కేటాయిస్తూ ఫైలుపై అప్పటి చంద్రబాబు సంతకం చేయగానే 2003 ఆగస్టు 9న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ రిజిస్టర్ కావడం, ఫైలు సిద్ధం చేయడం, నలుగురు మంత్రులు ఆమోదించడం.. ఇదంతా నాలుగే రోజుల్లో పూర్తయ్యిందన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.లక్ష మూలధనంతో మొదలైన కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువైన భూములను, క్రీడామైదానాలను అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఓ అనామక కంపెనీతో ఇంత ఖరీదైన ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల దుమారం రేగింది. అప్పట్లో ఈ భూ కేటాయింపు ఓ సంచలనంగా మారింది. దేశ చరిత్రలో నాలుగు రోజుల్లోనే అంతా పూర్తయిన భూ కేటాయింపు ఇదేనంటూ ప్రచారం జరిగింది. ఐఎంజీ భారత అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేశారు. దాని అధినేతగా అహోబలరావు అలియాస్ బిల్లీరావు ఉన్నారు. అద్భుతమైన క్రీడా మైదానాలు కట్టి, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి 2020 ఒలింపిక్స్ కు శిక్షణ ఇప్పిస్తారంటూ ప్రచారం చేశారు. నాలుగే రోజుల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అత్యంత ఖరీదైన 850 ఎకరాల భూమిని కట్టబెట్టారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కేవలం ఎకరం రూ.50 వేల వంతున ఐఎంజీకి కేటాయించారు. దీంట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏ పరిశ్రమకైనా భూమిని కేటాయించాలంటే అనేక షరతులు ఉంటాయి. ఇందులో మాత్రం అంత భూమిని ఇవ్వడం ద్వారా ఎంత ప్రయోజనం ప్రజలకు వస్తుందని అంచనా వేయలేదు. కనీసం ఎన్ని ఉద్యోగాలొస్తాయి? ఎంత మందికి శిక్షణ ఇస్తారన్న విషయమే పరిగణనలోకి తీసుకోలేదు.

ఐఎంజీకి కేటాయింపు..

- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నం.25లో 2374.02 ఎకరాలు ప్రభుత్వానిదే.

- ప్రభుత్వ మెమో నం.39612/Assn.V(2)2003, Dated.13.01.2004 ప్రకారం 400 ఎకరాలను ఐఏంజీ కోసం కేటాయించారు. 134 ఎకరాలను ఏపీఎన్జీవోకు కేటాయించారు.

- చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూ కేటాయింపుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, చట్ట విరుద్ధంగా కేటాయించారంటూ రద్దు చేశారు.

- మెమో నం.111080/S1/2003. AP Youth Advancement, Dated 21.11.2006 ప్రకారం 400 ఎకరాలను పంచనామా చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

- దాంతో ఐఏంజీ అకాడమీస్, భారత ప్రైవేటు లిమిటెడ్ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. 2006 నవంబరు 29 న హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. అప్పటి నుంచి కేసు నడుస్తున్నది. ఇన్నాండ్లకు దీనిపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం పట్ల రెవెన్యూ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News