CM Revanth Reddy: తెలంగాణ స్టేట్ ట్యాగ్ లైన్ ఖరారు.. ఇకపై రాష్ట్రాన్ని అలా పిలవాలన్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ను సీఎం వెల్లడించారు.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం 'ది ఫ్యూచర్ స్టేట్' కు పర్యాయపదంగా నిలుస్తుందని, అందువల్ల ఇకపై తెలంగాణను 'ప్యూచర్ స్టేట్' పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన తాజాగా కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు.
తెలంగాణకు ట్యాగ్ లైన్:
సీఎం మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. కానీ మన దేశంలోని రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్.. అని పిలుద్దాం..’ అని సీఎం ప్రకటించారు.
పెట్టుబడులకు అనుకూలం: శ్రీధర్ బాబు
ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.