నాయకుల పైసల వేట.. రూ.2వేల నోట్ల రద్దుతో సతమతం

జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలి, చట్టసభలలో అడుగుపెట్టాలనేది ప్రతి నాయకునికి జీవితకాల కోరికగా ఉంటుంది.

Update: 2023-05-21 02:41 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలి, చట్టసభలలో అడుగుపెట్టాలనేది ప్రతి నాయకునికి జీవితకాల కోరికగా ఉంటుంది. కొంతమందికి కాలం కలిసివచ్చి ఎమ్మెల్యేలుగా గెలిస్తే మరికొంతమందికి అది తీరని కలగానే మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన నాయకులు కొన్నినెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా పార్టీ టిక్కెట్ సంపాదించి గెలవాలని తాపత్రయపడుతున్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా పోటీ చేయాలనే వారి తపనకు ఆర్థిక పరిస్థితులు అడ్డుతగులుతున్నాయని తెలిసింది. గతంలో ముగిసిన హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికలలో డబ్బులు, మద్యం ఏరులైపారిన విషయం తెలిసిందే.

మునుగోడు బై ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్, బీజేపీలు వంద కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఎన్నికలలో ఈ స్థాయిలో ఖర్చు కాకున్నా కనీసం సగం వరకైనా సమకూర్చుకోవలసి ఉంటుందని ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కొత్తగా పోటీ చేయాలనుకునే వారు తమ ఆర్ధిక స్థితిగతులపై అంచనా వేసుకుంటున్నారు. ఎన్నికలకు నెలల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో పోటీ చేయాలనుకునే నాయకులు నిధుల వేటలోపడ్డారు. కాగా రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడంతో నాయకులు సతమతం అవుతున్నారు. దాచిపెట్టిన డబ్బులను మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

సపోర్ట్ చేసే వారి జాబితా సేకరణ..

రాబోయే ఎన్నికల బరిలో దిగాలనుకునే నాయకులకు డబ్బుల సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు తమకు అత్యంత సన్నిహితులైన వారితో అంతర్గత సమావేశాలు జరుపుతున్నట్లు తెలిసింది. తమకు ఆర్థికంగా సహకరించే వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వంటి వారి వివరాలు ఆరా తీస్తున్నారని సమాచారం. వారిని కలిసి రాబోయే ఎన్నికలలో తమకే టిక్కెట్ వస్తుందని, ఆర్ధికంగా సహకారం అందించాలని కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావుడి వచ్చినట్లుగా కనబడుతోంది.

ఎన్ఆర్ఐల సపోర్ట్ కోసం..

ఎన్ఆర్ఐల సపోర్ట్ కోసం వివిధ పార్టీల నేతలు తహతహలాడుతున్నారని సమాచారం. విదేశాలలో ఉంటూ స్థిరపడ్డ వారిలో తమకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని ఎంపిక చేసుకుని విదేశాలకు సైతం పరుగులు పెడుతున్నారని తెలిసింది. ఎన్ఆర్ఐ సపోర్ట్ దొరికితే ఎన్నికలలో ఖర్చు చేయడానికి నిధుల కొరత ఉండదని నేతలు భావిస్తుండడంతో విదేశాలకు వెళ్లైనా వారిని కలిసేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు తప్పితే మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందో? రాదో? అనేది చాలా మంది నాయకుల మనసులను తొలచివేస్తున్నాయి. అవసరమైతే సొంత ఆస్తులను తాకట్టు పెట్టడం, విక్రయించేందుకు సైతం వెనుకాడడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాత ఎన్నికలకు మరో ఐదేండ్ల పాటు వేచిచూడాల్సి రావడం, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయోననేది కూడా తెలియకపోవడంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నాయకులు నిధుల వేట కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News