సీఎం ఇలాకాలో నేతల ‘ఫీల్ బ్యాడ్’.. కేసీఆర్‌పై సొంత పార్టీ నేతల అసంతృప్తి
‘‘సరైన గౌరవం లేదు. మర్యాదా ఇవ్వట్లేదు.
‘‘సరైన గౌరవం లేదు. మర్యాదా ఇవ్వట్లేదు. అవహేళనగా చూస్తున్నారు..అవమానకరంగా మాట్లాడుతున్నారు. అసలు మమ్మల్ని లీడర్లుగానే ట్రీట్ చేయట్లేదు. పిలిచినప్పుడు పోవాలే.. చెప్పింది వినాలే. మా అభిప్రాయాలకు విలువే ఇవ్వరు. సమస్య ఉంటే ఎవరిని కలవాలో తెలియదు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వరు. ముఖ్యమంత్రిని కలుద్దామని ధైర్యం చేసి ఫామ్‌హౌజ్‌కు వెళ్తే పోలీసులు అడ్డుకుంటారు. పైకి అందరూ ఫీల్ గుడ్‌గా కనిపిస్తున్నారు.. కానీ లోపల మాత్రం ఫీల్ బ్యాడ్ అనే అభిప్రాయమే ఉన్నది.’’
ఇదీ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో బీఆర్ఎస్ లీడర్ల ఆవేదన.
దిశ, తెలంగాణ బ్యూరో : గజ్వేల్ నియోజక వర్గంలో విపక్ష పార్టీలకు లీడర్లు ఉండొద్దనే ఉద్దేశంతో కనిపించిన ప్రతి లీడర్‌నూ బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. గులాబీ పార్టీలోకి వచ్చిన తర్వాత కొందరికి నామినేటెడ్ పదవులిచ్చారు. ఇంకొందరికి పనులు చేసి పెట్టారనే టాక్ ఉన్నది. అయితే పార్టీలో తమకు తగిన గౌరవం, మర్యాద ఇవ్వట్లేదనే ఆవేదన మెజార్టీ లీడర్లలో కనిపిస్తున్నది.
ఇలా లోకల్ లీడర్లు పలు సందర్భాల్లో అవమాన పడిన ఘటనలు అనేకంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో తమను పట్టించుకునే వారే లేరని, సమస్య ఉంటే ఎవరిని కలవాలో తెలియడం లేదని, ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకునేందుకు సీఎం అపాయింట్‌మెంట్ కోరితే ఇవ్వరని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చినా స్వేచ్ఛ లేదనే టాక్ ఉన్నది.
షాడో ఎమ్మెల్యే, యాక్టింగ్ ఎమ్మెల్యేనే దిక్కు
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్యే ఉంటే తమకు మాత్రం అదనంగా ఇద్దరు ఉన్నారని లోకల్ లీడర్లు సెటైర్లు వేస్తున్నారు. అందులో ఒకరిని షాడో ఎమ్మెల్యేగా, మరొకరిని యాక్టింగ్ ఎమ్మెల్యేగా పిలుచుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గజ్వేల్ లీడర్లను కలిసేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న పని కోసం గజ్వేల్ ఏరియా ఆఫీసర్ దగ్గరకు వెళ్లాల్సిందేనని, అక్కడ పని కాకపోతే మంత్రి హరీశ్‌రావు దగ్గరికి వెళ్లాల్సి వస్తున్నదని నేతలు తలలు పట్టుకుంటున్నారు.
కనుచూపుమెరలో ఉన్నా కలవరు
సీఎం కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌజ్‌కు తరుచుగా వస్తుంటారు. కానీ సొంత నియోజకవర్గానికి చెందిన లీడర్లకు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ధైర్యం చేసి నేరుగా ఫామ్‌హౌజ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని పలువురు నేతలు చెబుతున్నారు. అత్యవసరంగా ఏదైనా పని ఉన్నా సీఎంను కలిసే అవకాశం ఉండదని లోకల్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం లోకల్‌గా ఉండే అధికారులతో మాట్లాడాల్సిందేనని నేతలు పేర్కొంటున్నారు.
పేరుకే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు
గజ్వేల్‌లో సుమారు రూ.3 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నిర్మించారు. సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఆ క్యాంపు ఆఫీసు డోర్లు, కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు అమర్చారు. కానీ సీఎం మాత్రం క్యాంపు కార్యాలయానికి ఇప్పటి వరకూ రాలేదనే విమర్శలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గజ్వేల్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న పలు భవనాల పనులను తనిఖీ చేస్తున్న సమయంలో మాత్రమే కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌కు వచ్చారని, ఆ తర్వాత ఆయన అటు వైపు కూడా రాలేదని గజ్వేల్‌కు చెందిన ఓ లీడర్ వివరించారు.