MLC కవిత అరెస్ట్‌పై లాయర్ విక్రమ్ చౌదరి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆమె తరుఫు న్యాయవాది విక్రమ్ చౌదరి కీలక వ్యాఖ్యలు

Update: 2024-05-24 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆమె తరుఫు న్యాయవాది విక్రమ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కవిత అరెస్ట్‌లో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఇష్యూపై కేసులు నమోదు చేసినప్పుడు అసలు కవిత పేరు లేనే లేదన్నారు. ఈ కేసులో నిందితులు, అప్రూవర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆమె‌పై కేసు నమోదు చేశారని అన్నారు. 7 ఏండ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో మహిళలకు చట్టం ప్రకారం ప్రత్యేక రక్షణ ఉంటుందని గుర్తు చేశారు.

కవిత అరెస్ట్ విషయంలో సీబీఐ, ఈడీ ప్రొసిజర్స్ ఫాలో కాలేదన్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ రిమాండ్‌ను కొట్టి వేసి తనను విడుదల చేయాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఈడీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయగా.. సీబీఐ మాత్రం గడువు కోరింది. ఈ క్రమంలో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు మే 27కు వాయిదా వేసింది. దీంతో గత కొద్ది రోజులుగా తీహార్ జైలులో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా..? రాదా..? తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 


Similar News