ఫైనల్ స్టేజ్‌లో ల్యాండ్ విలువ పెంపు అంశం.. రేపటి నుంచి వెబ్‌సైట్‌లో ‘మార్కెట్ వ్యాల్యూ’?

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ తుది దశకు చేరుకున్నది.

Update: 2024-07-03 02:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ తుది దశకు చేరుకున్నది.ఈనెల 1వ తేదీ నుంచి 15 వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని భావించగా..ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నది.ఈ అంశంపై నేడు (బుధవారం) వివిధ శాఖల ఉన్నతాధికారులు భేటీ నిర్వహించి చర్చించనున్నారు. ఏకాభిప్రాయం కుదిరితే రేపు (గురువారం) నుంచి వెబ్‌సైట్‌లో మార్కెట్ ధరలు చూడడానికి అవకాశం ఉంటుంది.కాగా,అన్ని రకాల స్థలాల ధరలు పెరిగే చాన్స్ కనిపిస్తున్నది.వ్యవసాయ భూములపై పెంపు కాసింత ఎక్కువే ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.30 నుంచి 200 శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే క్షేత్ర స్థాయి, బహిరంగ మార్కెట్ విలువలను రిజిస్ట్రేషన్ అధికారులు,సిబ్బంది పరిశీలించారు.

ఎకరం ధర రూ.15లక్షలు..

రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎకరం భూమి రూ.15 లక్షలకు తక్కువ లేదని గుర్తించినట్లు తెలిసింది. అందుకే ఎకరానికి కనిష్టంగా రూ.4 లక్షల మార్కెట్ వ్యాల్యూ నిర్ణయించనున్నట్లు సమాచారం.అప్పటికీ మార్కెట్,బహిరంగ విలువలకు మధ్య తేడా ఉంటుందనే అభిప్రాయం ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ఏ ప్రాంతంలో ఎంత మేర ధరలను నిర్ణయించారనే విషయం వెల్లడి కానుంది.

భూసేకరణపై ప్రభావం..

గత ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల కింద భూ సేకరణ పేరిట వేలాది ఎకరాలను రైతుల నుంచి స్వాధీనం చేసుకుంది. నష్టపరిహారం చెల్లింపుల్లో రిజిస్ట్రేషన్ విలువకు మూడింతలంటూ లెక్క కట్టింది.ఇక భూ సేకరణ ప్రక్రియ దాదాపు ముగిసిందనుకున్న తర్వాతే మార్కెట్ విలువలను పెంచింది.ఎనిమిదేండ్ల తర్వాత తొలిసారి రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్లు సమర్థించుకున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులపై అధ్యయనం చేశామంటూ స్టాంప్ డ్యూటీని 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. అలాగే, మిగతా అన్ని రకాల డీడ్స్‌కి స్టాంప్ డ్యూటీని పెంచారు.

అప్పట్లో సబ్ రిజిస్ట్రార్లు, తహశీల్దార్ల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకోకుండానే ఉన్నతాధికారులే ధరలను పెంచారని ఆరోపణలున్నాయి. ఇప్పుడేమో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంగా పని చేస్తున్నాయి. మరోవైపు మార్కెట్ విలువల పెంపు భారం ప్రభుత్వంపై కూడా పడే అవకాశమున్నది. ప్రధానంగా రీజినల్ రింగ్ రోడ్డు కోసం సేకరించనున్న భూములకు చెల్లించాల్సిన నష్టపరిహారం పెరగనున్నది.దీంతో భూసేకరణకు మూడింతలు ఖర్చు పెరగొచ్చని అంచనా.కాగా, భూముల విలువ రూ.కోట్లల్లో పలికే ప్రాంతాల గుండానే రిజినల్ రింగ్ రోడ్డు వస్తుండటం గమనార్హం.


Similar News