రాజకీయ సవ్వసాచి..
అపర చాణక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు ఆయన గురువు.
బహుభాషా కోవిదుడు, రచయిత
హైదరాబాద్ రాష్ట్ర సీఎం బూర్గుల
పీవీ నరసింహా రావుకు గురువు
భూ సంస్కరణలకు పెద్దపీట
దిశ, వెబ్డెస్క్ : అపర చాణక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు ఆయన గురువు. న్యాయవాది, బహుభాషావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన ఏకైక ముఖ్యమంత్రి, రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన తొలి తరం కాంగ్రెస్ నాయకుడు.. ఆయన మరెవరో కాదు రాజకీయ సవ్యసాచిగా మన్ననలు పొందిన బూర్గుల రామకృష్ణా రావు. నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం కావడంలో ఆయన పోరాటం మరిచిపోలేనిది.
న్యాయవాదిగా.. స్వాతంత్ర్య పోరాటంలో..
బూర్గుల 1899 మార్చి 13వ తేదీన కల్వకుర్తి తాలూకా పడకల్లు గ్రామంలో జన్మించారు. ఆయన ఇంటి పేరు పుల్లం రాజు. అయినా స్వగ్రామం బూర్గుల పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. హైదరాబాద్ లోని ధర్మపంత్ స్కూల్ లో ప్రాథమిక విద్య, పుణేలో బీఏ డిగ్రీ, బొంబాయి యూనివర్సిటీలో న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. హైదరాబాద్ లో లా ప్రాక్టీసు ప్రారంభించిన బూర్గుల వద్ద పీవీ నరసింహా రావు శిష్యరికం కూడా చేశారు. న్యాయవాదిగా రాణిస్తూనే మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి తదితరులతో కలిసి ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ను స్థాపించిన వారిలో బూర్గుల ప్రముఖుడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. 1948లో నిజాం నవాబు లొంగిపోయిన తర్వాత వెల్లోడి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో రెవెన్యూ, విద్యా శాఖల మంత్రిగా పనిచేశారు. వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి పూర్తి సహకారం అందించారు.
కౌల్దార్లకు భూమిపై హక్కు..
హైదరాబాద్ రాష్ట్రానికి 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన బూర్గుల.. షాద్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పూర్తి మెజారిటీ లేకున్నా, మంత్రుల సంపూర్ణ సహకారం అందకున్నా నాలుగేళ్ల పాటు సీఎంగా కొనసాగి పాలనాదక్షుడిగా గుర్తింపు సంపాదించారు. కౌలు రైతులకు, భూమి లేని పేదలకు వ్యవసాయ భూమిపై హక్కు కల్పించే భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో కలిసిపోయి ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో 1956లో కేరళ రాష్ట్ర గవర్నర్ గా వెళ్లిన బూర్గుల 1960 వరకు కొనసాగారు. తర్వాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. 1962లో రాజ్యసభకు ఎన్నికై నాలుగేళ్ల పాటు కొనసాగారు. సాహిత్యంలోనూ బూర్గుల నిష్ణాతుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పార్శీ, సంస్కృత భాషల్లో ఆయన చేసిన రచనలు, వ్యాసాలు, గ్రంథాలు, కవితలు పుస్తక రూపంలోకి వచ్చి ప్రజాదరణ పొందాయి. బూర్గుల 1967 సెప్టెంబరు 14వ తేదీన గుండెపోటుతో చనిపోయారు.