‘లక్ష సాయం’.. సర్కారు కీలక మార్గదర్శకాలు ఇవే..!

కులవృత్తులు చేసుకునే బీసీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే స్కీమ్‌ను కేసీఆర్ ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Update: 2023-06-07 03:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ రకాల కులవృత్తులు చేసుకునే బీసీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే స్కీమ్‌ను సీఎం కేసీఆర్ ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనున్నారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ సాయం అందుకునే అవకాశం ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. పల్లెల్లో గరిష్ట వార్షిక ఆదాయం లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు ఉంటేనే ఈ స్కీమ్‌కు అర్హత ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

ఇప్పటికే ప్రభుత్వం తరఫున గడిచిన ఐదేళ్లలో రూ.50 వేల పరిమితికి మించి వివిధ రకాల పథకాల ద్వారా సాయం అందుకుంటున్న వారికి ఈ కొత్త స్కీమ్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల వయస్సు 18-55 ఏండ్ల మధ్య ఉంటేనే అర్హత లభిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంటుందని బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు.

అప్లై చేసుకున్న వారందరి దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయిలో అధికారులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరిశీలిస్తారని, ఆ తర్వాత కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే సెలక్షన్ కమిటీ వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఫైనల్ చేస్తుందని తెలిపారు. ఈ నెల 27 నుంచి జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆమోదంతో జూలై 4వ తేదీ నాటికి లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి వెబ్‌సైట్‌లో, మండల కార్యాలయాల్లో, పంచాయతీ ఆఫీసుల్లో డిస్‌ప్లే కోసం ఉంచుతారని తెలిపారు.

వన్ టైమ్ బెనిఫిట్‌గా నిధులు

ఎంపికైన లబ్ధిదారులకు ప్రతి నెలా 15వ తేదీన వన్ టైమ్ బెనిఫిట్‌గా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని బుర్రా వెంకటేశం తెలిపారు. లబ్ధిదారులు ఈ ఆర్థిక సాయం ద్వారా ఎలాంటి ఉపకరణాలు కొనుగోలు చేసుకోవాలో వారికే సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఆర్థిక సాయం అందుకున్న తర్వాత నెల రోజుల వ్యవధిలోనే యూనిట్లను గ్రౌండింగ్ చేసుకునేలా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు.

కలెక్టర్ అపాయింట్ చేసిన మండల స్పెషల్ ఆఫీసర్ లేదా ఎంపీడీవో ఆ లబ్దిదారులు నెలకొల్పుకున్న యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. రెండేళ్ల వరకు ప్రతి మూడు నెలలకోసారి స్పెషల్ ఆఫీసర్ ఆ యూనిట్లను పర్యవేక్షిస్తూ ఉంటారని, అవి ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించి లబ్ధిదారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారని వివరించారు.

Tags:    

Similar News