విద్యాశాఖలో కొరవడిన సమన్వయం.. అన్నింట్లో ఆ ఇద్దరే!

విద్యాశాఖలో సమన్వయం కొరవడిందని, అందుకే తప్పుల మీద తప్పులు జరుగుతున్నట్టు చర్చ ఉంది.

Update: 2023-04-05 04:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాశాఖలో సమన్వయం కొరవడిందని, అందుకే తప్పుల మీద తప్పులు జరుగుతున్నట్టు చర్చ ఉంది. డిపార్ట్‌మెంట్‌పై ఇతరుల పెత్తనం ఎక్కువైందని ప్రచారం జరుగుతోంది. టెన్త్ పేపర్ల లీక్ ఎఫిసోడ్‌తో విద్యాశాఖలో ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. డిపార్ట్‌మెంట్ మొత్తం ఓ అధికారి, ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే పనిచేస్తున్నట్టు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణ, వర్సిటీల అనుమతులు, టీచర్ల బదిలీలు, ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ ఇలా అన్ని విషయాల్లో ఆ ఇద్దరి ప్రమేయం ఎక్కువని విమర్శలు వస్తున్నాయి.

ఆ ఇద్దరిదే పెత్తనం

విద్యాశాఖలోని అన్ని విభాగాల్లో ఆ ఇద్దరి పెత్తనానికి తిరుగు లేదని ఆరోపణలు వస్తున్నాయి. అందులో ఒకరు సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ అధికారి. మరొకరు ప్రగతిభవన్‌కు ఎప్పుడంటే అప్పుడు వెళ్లగలిగే ఓ ప్రజాప్రతినిధి. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆ ఇద్దరే విద్యాశాఖలో చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తున్నది. సెక్రటరీ నుంచి మొదలుకుని జిల్లా విద్యా శాఖాధికారి వరకు ఎవరు ఉండాలి? ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి? ఎవరిని బదిలీ చేయాలి? అనే అంశాలపై ఆ ఆఫీసర్ నిర్ణయం మేరకు జరుగుతాయని ప్రచారం ఉంది.

గత ఏడాది సెప్టెంబర్‌లో కొత్తగా ఆరు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అందులో కొన్ని సంస్థలకు టీచింగ్ అనుభవం లేకున్నా అనుమతులు ఇప్పించడంలో ఈ ఇద్దరు కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలను ఎలా కంట్రోల్ చేయాలి? ఏ మేరకు ఫీజులు పెంచుకోవచ్చు? అందుకు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు లేకుండా ఏం చేయాలి? అనే విషయాలను సదరు ప్రజాప్రతినిధి చక్కబెడుతారని ప్రచారం ఉంది.

ఫీజు పెంపు, టీచర్ సంఘాల పెత్తనం వారి చేతుల్లోనే

ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వానికి నియంత్రణ లేదని విమర్శలు వచ్చాయి. దీంతో అధికారులు ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న సంస్థలపై చర్యలకు దిగారు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగి సదరు అధికారులకు క్లాస్ పీకినట్టు ప్రచారం ఉంది. ఇక టీచర్ సంఘాలు ఎప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారిని ఎలా కంట్రోల్ చేయాలి? అనే విషయాలను వారే మానిటరింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మంత్రుల ప్రమేయం తగ్గించడమే అసలు సమస్య

ప్రభుత్వంలో అన్ని శాఖల్లో మంత్రుల ప్రమేయం చాలా తక్కువనే అభిప్రాయం ఉంది. మంత్రులు లేకుండానే ప్రగతిభవన్‌లో వారి శాఖలపై రివ్యూలు జరిగాయి. కీలకమైన నిర్ణయాలు వారికి తెలియకుండానే జరిగినట్లు ప్రచారం ఉంది. అందుకే అధికారులు సంబంధిత మంత్రులకు అంతగా ప్రియారిటీ ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖలోనూ అదే సంప్రదాయం కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది.

ఆ మధ్య రాత్రికిరాత్రి టీచర్ల బదిలీలు జరిగాయి. ఇతర జిల్లాల నుంచి మంత్రి సొంత జిల్లాకు పెద్ద ఎత్తున టీచర్లు బదిలీ అయ్యారు. ఈ విషయం తెలుసుకుని మంత్రి కంగుతిన్నట్టు జిల్లా వర్గాల్లో ప్రచారం ఉంది. ఇంటర్, టెన్త్ బోర్డుల పరీక్షల నిర్వహణపై సంబంధిత బోర్డుల అధికారులు చాలా కాలంగా మంత్రి కన్నా సీఎంకు సన్నిహితంగా ఉండే అధికారికే ఎప్పటికప్పుడు రిపోర్టు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Tags:    

Similar News