భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరంలో ప్రత్యక్షమైన ‘YSR ఆత్మ’!

టీకాంగ్రెస్ లో అంతర్గత వ్యవహారాలు రోజు రోజుకూ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇప్పటి వరకు టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా వ్యవహారం సాగగా తాజాగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ వ్యవహారం టీ కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది.

Update: 2023-05-20 13:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీకాంగ్రెస్ లో అంతర్గత వ్యవహారాలు రోజు రోజుకూ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇప్పటి వరకు టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా వ్యవహారం సాగగా తాజాగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ వ్యవహారం టీ కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత సీఎం వైఎస్సార్ కు ఆత్మగా పేరు పొందిన కే.రామచందర్ రావు రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా కాస్త సైలెంట్ అయ్యారు. ఏపీకి చెందిన ఈ కీలక నేతకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి కేవీపీ అనూహ్యంగా భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్ర శిభిరంలో ప్రత్యక్షం అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటున్న భట్టి విక్రమార్కను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భట్టి చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర తరహాలోనే సీఎల్పీ నేత పీపుల్స్ మార్చ్ కొనసాగుతోందని ప్రశంసించారు.


షర్మిల కోసమే భట్టివద్దకు?:

వడదెబ్బతో అస్వస్థతకు గురైన విశ్రాంతిలో ఉన్న భట్టి విక్రమార్క వద్దకు కేవీపీ వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కేవీపీకి వైఎస్సార్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. అయితే షర్మిల స్థాపించిన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం లేదా పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిపై చర్చించేందుకే షర్మిల కర్ణాటకకు వెళ్లి డీకేను కలిసి వచ్చారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ కోసమే కేవీపీ భట్టి వద్దకు రాయబారం నడిపించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవీపీ కేసీఆర్ కు సత్సంబంధాలు ఉన్నాయనే టాక్ ఉంది. కేసీఆర్ ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను పార్టీలోని కొంత మంది సీనియర్ల ద్వారా కేవీపీనే అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

కేవీపీ వ్యవహారంపై అనుమానాలు:

గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు పరిచయాలు కలిగిన కేవీపీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల తరచూ కనిపించడం హాట్ టాపిక్ గా మారుతోంది. కర్ణాటక ఫలితాలతో మంచి ఊపు మీదున్న టీ కాంగ్రెస్ లో కేవీపీ ఎంట్రీ ఇస్తే అది మొదటికే మోసం అనే అనుమానాలు ఓ వర్గం నుంచి వ్యక్తం అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. గత పాలన అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజల్లో ఓ రకమైన భావన ఉండగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కేవీపీ ఇప్పుడు భట్టి విక్రమార్క ను ఆకాశానికెత్తడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గత ఎన్నికల్లో ఏపీకి చెందిన నేత అంటూ చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ లబ్దిపొందారని ఇప్పుడు కేవీపీ ఇక్కడి వ్యవహారాల్లో తలదూర్చితే ప్రజలు, క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందనే చర్చ టీ కాంగ్రెస్ సర్కిల్స్ లోనే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవీపీ టీ కాంగ్రెస్ నేతలను కలవడం పార్టీ ప్రయోజనాలకు అంత మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అనేక అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న టీకాంగ్రెస్ వ్యవహారాల్లో కేవీపీ తరచూ ప్రవేశిస్తే అది అంతిమంగా కేసీఆర్ కే లాభం చేకూర్చుతుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కేవీపీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News