రేపు ఢిల్లీలో కవితను కలవనున్న కేటీఆర్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి ఎమ్మెల్సీ కవితను కలవనున్నట్లు సమాచారం.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి ఎమ్మెల్సీ కవితను కలవనున్నట్లు సమాచారం. సీబీఐ కార్యాలయంలో కవితను కేటీఆర్ కలిసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ కవితను బెయిల్‌పై బయటకు తీసుకోచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలలోపే కవితను బయటకు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కవిత సీబీఐ ఇంటరాగేషన్
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజులు సీబీఐ కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నెల 15 వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనుంది. నేటి నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో కవిత విచారణ జరగనుంది. అయితే కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, కవిత పిల్లలు, పీఏ శరత్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అనుమతి ఉన్నది. అదేవిధంగా కస్టడీలో కవితకు ఇంటి భోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుమతించింది.