KTR: అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ.. మాజీ మంత్రి కేటీఆర్ స్పెషల్ ట్వీట్

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ (Bathukamma) సంబురాలకు యావత్ తెలంగాణ (Telangana) సిద్ధమైంది.

Update: 2024-10-02 05:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ (Bathukamma) సంబురాలకు యావత్ తెలంగాణ (Telangana) సిద్ధమైంది. ప్రకృతిని ఆరాధిస్తూ నేడు ఎంగిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే పండుగను తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఉల్లాసంగా ఆడి పాడేందుకు ఆడపడుచులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆశ్వీయుజ శుద్ద అమవాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమ్యే బతుకమ్మ సంబురాలు దుర్గాష్టమి పర్వదినాన సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.

ఈ క్రమంలోని బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ ఆడపడుచులకు ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. నేటి నుంచి నిర్విరామంగా తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులంతా ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మే అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ పండుగ అని తెలిపారు. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. ఆటపాటలతో, ఆనందోత్సాహాల నడుమ తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News