వాళ్లతోనే కొట్లాడాం.. రేవంత్ ఎంత ? : కేటీఆర్ సంచలనం
ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన రైతుపోరుబాట సభలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో కొట్లాడటం తమకు లెక్కే కాదన్నారు.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం.. రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజూ సోషల్ మీడియా, మీడియా వేదికలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన రైతన్నల ధర్నాలో పాల్గొన్న కేటీఆర్.. మరోసారి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ రైతు పోరుబాట సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు.
రైతు భరోసా కింద ఎకరాకు ఇస్తామన్న రూ.15 వేలు ఎక్కడ ? అని ప్రశ్నించారు. అలాగే ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడుందని నిలదీశారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్ల పేరు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పై బాధితులే కేసులు పెట్టాలి గానీ.. ఇక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అందరూ పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులుపెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండదన్నారు. ఏ అధికారి అయినా సరే ఎక్స్ ట్రా లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. న్యాయం, ధర్మం ప్రకారం ప్రభుత్వ అధికారులు పనిచేయాలని సూచించారు. ఎస్ఐ, సీఐ, ఎస్పీ, కలెక్టర్.. ఎవరైనా సరే.. ఎక్స్ ట్రాలు చేసినవారి పేర్లు రాసిపెట్టుకుని మిత్తీతో సహా చెల్లిస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి.. రాజునో, చక్రవర్తినో కాదన్నారు కేటీఆర్. నాడు చంద్రబాబు, వైఎస్సార్ లాంటి నాయకులతోనే కొట్లాడామని.. రేవంత్ రెడ్డితో కొట్లాడటం తమకు లెక్కే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా, అన్యాయంగా రైతులపై కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.