KTR: తక్షణమే ఆ నీటిని తొలగించండి.. ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్
వరదలు రావడం వల్ల వట్టెం పంప్ హౌజ్ లో బాహుబలి మోటార్లు నీట మునిగాయని, అందులో నిలిచి ఉన్న నీటిని తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వరదలు రావడం వల్ల వట్టెం పంప్ హౌజ్ లో బాహుబలి మోటార్లు నీట మునిగాయని, అందులో నిలిచి ఉన్న నీటిని తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నీట మునిగిన మోటార్లకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ల మూలాధారాలను కనిపెట్టి, మళ్లీ ఆవిష్కరిస్తూ ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నాడని, ఆయన తన విధులను విస్మరిస్తున్నారని కొందరు గుర్తు చేస్తుంటారని ఈ ‘పాలమూరు బిడ్డ’ గుర్తుంచుకోవాలన్నారు.
అలాగే ఇటీవల సెప్టెంబరు 3న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్) వట్టెం పంప్‌హౌస్‌లో వరదలు రావడంతో తీవ్ర విపత్కర పరిస్థితి నెలకొన్నదని, ఈ ఘటనతో బాహుబలి మోటార్లు నీట మునిగాయని తెలిపారు. అత్యవసరమైనప్పటికీ, ఇప్పటి వరకు కేవలం ఒక మీటరు నీరు మాత్రమే బయటకి వెళ్లిందని, మరో 18 మీటర్ల మేర నిలిచి ఉన్న నీటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ఇక ముఖ్యమంత్రి తెలంగాణకు, రైతులకు ముఖ్యమైన ప్రతిదాన్ని నాశనం చేయడానికి ఎందుకు నరకయాతన పడుతున్నారో సమాధానం ఇవ్వాలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.