KTR: నన్ను విచారణకు పిలవాల్సిన అవసరం లేదు.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) విచారణలో భాగంగా బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.

Update: 2025-01-06 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) విచారణలో భాగంగా బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే నందినగర్‌లోని ఆయన నివాసం నుంచి బీఆర్ఎస్ లీగల్ టీమ్‌తో కలిసి బయలుదేరారు. కేటీఆర్ విచారణకు హాజరు అవుతున్నారని తెలియడంతో ఆయన నివాసానికి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఏసీబీ ఆఫీస్ వద్దకు చేరుకున్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందని, తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. తమ వెంట విచారణకు లాయర్లు వస్తే అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదన్నారు.

చట్టాలను గౌరవించి విచారణకు వచ్చానని తెలిపారు. అదేవిధంగా తనను విచారణకు పిలిచి ఇంటిపై కూడా రైడ్స్ చేసేందుకు ప్లాన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు బనాయించాలని తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని కామెంట్ చేశారు. ఎన్ని డ్రామాలు చేసినా.. అక్రమ కేసులు పెట్టినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలోనూ కుట్రలు చేశారని, పోలీసులు దొంగ స్టేట్‌మెంట్లు సృష్టించారని ఫైర్ అయ్యారు. నరేందర్ రెడ్డికి జరిగిందే తనకు జరుగుతోందని కేటీఆర్ అన్నారు. తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఈ డ్రామాలు ఎందుకని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పత్రాలను తన ఇంట్లో పెట్టించి తను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో మంత్రిగా తాను నిర్ణయం తీసుకున్నానని.. ఆ సమాచారం అంతి ఏసీబీ దగ్గరే ఉందని కేటీఆర్ అన్నారు.

కాగా, ఐఏఎస్ దానకిశోర్ స్టేట్ మెంట్ ఆధారంగా ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. కాగా, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a), (13)2, IPCలోని సెక్షన్ 409 రెడ్ విత్ 120-B ప్రకారం ఇప్పటికే ఏసీబీ కేసులు నమోదు చేసింది. అయితే, కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది.

Tags:    

Similar News